అమరావతి రైతులకు కోపం వచ్చింది!!
రాజధాని అమరావతి పరిధిలోని ఆర్-5 జోన్‌లో జరుగుతున్న పనులను రైతులు అడ్డుకున్నారు. తుళ్లూరు మండలం దొండపాడులో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పనులు, భూమి చదును కోసం సీఆర్డీఏ అధికారులు పొక్లెయిన్లతో వచ్చారు. వారిని అడ్డుకున్న రైతులు తిరిగి వెనక్కి పంపారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇళ్లస్థలాలకు తాము వ్యతిరేకం కాదని, ఆర్-3 జోన్ లో ఇచ్చుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన ప్రాంతంలో ఇళ్థస్థలాలు కావాలనే ఇస్తున్నారని, కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు.
పేదలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తుళ్లూరులో ఆర్-5 జోన్ ను వ్యతిరేకిస్తూ అన్నదాతలు భారీ ర్యాలీ నిర్వహించారు. దీక్ష జరుగుతున్న శిబిరం నుంచి సీఆర్ డీ ఏ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. సెంటు భూమి వద్దు.. టిడ్కో ఇల్లు ముద్దంటూ నినాదాలు చేశారు. సీఆర్‌డీఏ కార్యాలయంలోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా గేట్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు. అయినా రైతులు నెట్టుకుంటూ లోపలికి వెళ్లి కార్యాలయం దగ్గర బైఠాయించారు. ఆర్-5 జోన్ రద్దు చేయాలంటూ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు హెచ్చరించారు.

ఆర్-5 జోన్ ను అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణాల కోసం తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చామని, పేదలకు ఇళ్ళస్థలాలివ్వడానికి కాదంటున్నారు. ఒకవేళ ఇవ్వాలనుకున్న ఆర్3లో ఇవ్వాలని, ఎలక్ట్రానిక్ సిటీ కోసం ఉన్న భూములను ఇవ్వడం సరికాదంటున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మందడం, కృష్ణాయపాలెం, కురగల్లు, ఐనవోలు గ్రామాల్లో స్థలాలివ్వాలనే నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. రైతుల అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చడంతో అన్నదాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వచ్చేవారం దీనిపై విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications