రామ్ గోపాల్ వర్మ క్వాలిఫికేషన్ ఇదీ..!!
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి 37 సంవత్సరాల తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సివిల్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్ ను అందుకున్నారు.
అమరావతి: రామ్ గోపాల్ వర్మ.. దర్శకుడు మాత్రమే కాదు- సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించే ఓ పొలిటికల్ క్రిటిక్ కూడా. ఈ మధ్యకాలంలో రాజకీయాలపై తన విమర్శల తీవ్రతను పెంచారు. వాటికి మరింత పదును పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై తెలుగుదేశం పార్టీ, జనసేన- ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుంటారు. ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోతుంటారు. విమర్శలకు సెటైర్లను జోడిస్తోండటం ఆయన ప్రత్యేకత- అందుకే అవి వైరల్ గా మారుతుంటాయి.
ఇదివరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఓ మినీ యుద్ధమే సాగించారు రామ్ గోపాల్ వర్మ. తనపై ఆయన చేసిన విమర్శలను అదే రేంజ్ లో తిప్పికొట్టారు. నాగబాబుపైనా మాటల తూటాలను సంధించారు. ఆయన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ ను వదల్లేదు. తాను పవన్ కల్యాణ్ కు అతి పెద్ద అభిమానిగా చెప్పుకొంటుంటారు ఆర్జీవీ. ఆయన మేలు కోసమే తాను చురకలు అంటిస్తుంటాననీ సమర్థించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

తాజాగా- జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాన్ని కూడా రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ ను నిలకడ లేని నాయకుడిగా అభివర్ణించారు. దివంగత కాపు నేత వంగవీటి రంగాకు తాను స్వయంగా టీ అందించానంటూ చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు.

అబద్ధం అనేది సత్యాన్ని అణిచి వేయడానికి ఉపయోగించే ఓ పరికరం అని.. ఇది అబద్ధాలను ఎలివేట్ చేయడానికి కూడా వినియోగించుకోవచ్చని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అబద్ధం చెప్పడంలో ఓ ప్రధాన సమస్య ఉందని, గతంలో చెప్పిన అబద్ధాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. అలా గుర్తుంచుకుంటేనే అదే అబద్ధాన్ని పదే పదే చెప్పడానికి బాగుంటుందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించుకోవచ్చని పవన్ ను చూసి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

కాగా- తాజాగా ఆయన సివిల్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్ ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. 1985 జులైలో ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సివిల్ ఇంజినీరింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ సర్టిఫికెట్ ను అందుకోలేదాయన. 37 సంవత్సరాల తరువాత బీటెక్ డిగ్రీని అందుకోవడం పట్ల చాలా థ్రిల్ అవుతున్నానని అన్నారు. 1985లో సివిల్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ చేయడంలో ఆసక్తి లేకపోవడం వల్ల సర్టిఫికెట్ పొందలేకపోయానని చెప్పారు.












Click it and Unblock the Notifications