మంత్రి పెద్దిరెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు అందింది. స్థానిక నాయకుడైన బోడె రామచంద్రయాదవ్ అమిత్ షాను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఇటీవల వైసీపీ గూండాలు తనను, తన కుటుంబాన్ని చంపడానికి పుంగనూరులో దాడులు చేశారని అమిత్ షాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ పై ఆరోపణలు చేస్తే దాడులకు తెగబడుతున్నారని యాదవ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత నెలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులతో తనపై దాడిచేయించారని, అయినా ఇప్పటివరకు పోలీసులు ఎవరిపై చర్యలు తీసుకోలేదని రామచంద్రయాదవ్ తెలిపారు. కనీసం మంత్రిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయన్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, తనపై దాడి గురించి పూర్తి వివరాలను అమిత్ షా అడిగారని వెల్లడించారు.

విచారణ జరిపి దాడిచేసినవారిపై తగిన చర్యలు తీసుకుంటామని షా చెప్పారని, తనకు భద్రత కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో పుంగనూరు నుంచి పోటీచేశానని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై దాడిచేశారని చెప్పారు. గత నెల నాలుగోతేదీన రైతుభేరి, రైతులపై చేస్తున్న దాడులపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, ఆ సమావేశాన్ని జరగనీయకుండా అడ్డుకున్నారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సభ పెట్టుకోనివ్వలేదని, పుంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, పోలీసు వ్యవస్థ కారణంగానే తన ఇంటిపై దాడిచేసి కుటుంబాన్ని హత్యచేసేందుకు ప్రయత్నించారని రామచంద్రయాదవ్ ఆరోపించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇటీవలే కుప్పం పర్యటన పూర్తిచేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డం పెట్టుకొని తన పర్యటనను అడ్డుకుంటున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనికి కారణం పెద్దిరెడ్డేనని, పుంగనూరులో ఈసారి అతన్ని ఓడిస్తామని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications