జనవరి 25న తిరుమలలో..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. సోమవారం నాడు 67,568 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 22,084 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 4.58 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పట్టింది.
తిరుమలలో గురువారం జంట పండగలు జరుగనున్నాయి. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి, పుష్యమాస పౌర్ణమి గరుడసేవ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. దీనికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

తిరుమలలో ఉన్న సప్తతీర్థాలు- స్వామి పుష్కరిణీ తీర్థం, కూమారధార తీర్థం, తుంబురు తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థాలకు ప్రతి సంవత్సరం ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. గురువారం ఈ వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం 7:30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు.

సాయంత్రం పుష్యమాస పౌర్ణమి గరుడ సేవను జరుపుతారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో గరుడసేవను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. సాయంత్రం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు.












Click it and Unblock the Notifications