తిరుమల శ్రీవారికి ఆదివారం రికార్డు స్థాయిలో ఆదాయం...
ఆంధ్ర్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడు. అందుకే ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామివారికి మరోసారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీకి ఆదివారం ఒక్కరోజే కాసుల వర్షం కురిసింది. ఆదివారం సెలవు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఒక్క ఆదివారం నాడే శ్రీవారి హుండీ ఆదాయం రూ.5కోట్ల మార్కును చేరుకుంది. శ్రీవారి హుండీకి ఆదివారం రూ.5.09 కోట్లు ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది.
ఒక్క ఆదివారం నాడే తిరుమల స్వామివారిని మొత్తం 76,577మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 23,656 భక్తులు వెంకటేశ్వరస్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గత మూడు రోజుల నుంచి ఇక్కడ కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనం టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పది గంటలు వేచి ఉండాల్సి వస్తోంది.

శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి కోసం బారులు తీరిన భక్తులు...
తిరుమలలో శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని ఆలయ పూజారులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కుమారధారతీర్థ ముక్కోటిని మాఘ మాసంలో పూర్ణిమనాడు నిర్వహిస్తారు. ఆ రోజు అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తారు.
ఆ రోజున భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో స్వామివారిని దర్శించుకుని పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక రోజు సందర్భంగా భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్నిరకాల సౌకర్యాలను కల్పించారు. భక్తుల కోసం అన్నప్రసాదం కూడా చేశారు. ఇందులో భాగంగా భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు, తాగునీరు టీటీడి అధికారులు అందించారు. ప్రథమచికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications