టైం ఉంది: కెసిఆర్‌కు రేవంత్ చురక, నా గురించి వద్దు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసంగం పైన టిటిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. ఆయన మాట్లాడే సమయంలో తెరాస సభ్యులు అభ్యంతరం తెలిపితే ఆయన కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు కెసిఆర్ మాట్లాడుతూ... రాజకీయాలకు ఇప్పుడు సమయం కాదని, రాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేద్దామని, నాలుగేళ్ల తర్వాత రాజకీయాలు చేద్దామన్నారు.
ఈ నేపథ్యంలో రేవంత్ మాట్లాడే సమయంలో తెరాస సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. కౌంటర్‌గా రాజకీయాలకు ఐదేళ్ల టైం ఉంది అంటూ చురకలు అంటించారు. మరో సమయంలో తెలంగాణ భవన్ కట్టినప్పుడు తాను అక్కడే ఉన్నానని, తన గురించి మాట్లాడవద్దని ఎద్దేవా చేశారు.

రెండున్నర గంటల్లో కెసిఆర్ తమను ఆనందం వరకు తీసుకు వెళ్లారన్నారు. అయితే వారు చెప్పినదాంట్లో మాత్రమే ఆనందముందన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను లేవనెత్తారు. కెసిఆర్ తన మంత్రివర్గంలోకి గిరిజనుడిని తీసుకోవాలని కోరారు. తన నియోజకవర్గంలో కాంట్రాక్టు టీచర్లకు తాను ఫీజులు చెల్లిస్తున్నానని చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60కి పెంచాలన్నారు. సిమెంట్ ధరలు ఓవర్ నైట్ వంద రూపాయలు పెరిగాయన్నారు.
మోడీ సహకరిస్తామన్నారు: కెసిఆర్
విద్యార్థుల పైన గుంపగుత్తగా కేసులను ఎత్తివేస్తామని కెసిఆర్ చెప్పారు. త్వరలో పాతబస్తీలో పర్యటించి సమస్యలు తీరుస్తామన్నారు. హైదరాబాదు శాంతిభద్రతల పైన ఎలాంటి ఆందోళన వద్దన్నారు. మెట్రో కోసం చారిత్రక సుల్తాన్ బజార్‌ను వదులుకోమన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. 108, 104లను పునరుద్ధరిస్తామన్నారు. జిల్లా పునర్ వ్యవస్థీకరణ తప్పనిసరి అని దానికి తొందరపడమన్నారు. అందరినీ సంప్రదిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే ప్యాకేజీని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని తాను నరేంద్ర మోడీని కలిసి కోరానని, ఆయన అంగీకరించారని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై మోడీ హామీ ఇచ్చారన్నారు. ఎపికి ఓ నీతి.. తెలంగాణకు మరో నీతి ఉండదని ప్రధాని చెప్పారన్నారు. దేశం బాగుపడాలన్నదే తన కోరిక అని మోడీ తనతో అన్నారని, అన్ని రాష్ట్రాలు తనకు సమానమని చెప్పారన్నారు. అలా చెప్పినందుకు మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నారు.












Click it and Unblock the Notifications