టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు ఎదురుగాలి- గ్రౌండ్ రిపోర్ట్
Chandrababu and Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. వార్షికోత్సవ వేడుకలను జరుపుకొంటోంది.
గత ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీకి చెందిన ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ రంగంలోకి దిగింది. తన తాజా నివేదికను రూపొందించింది. మొన్నటి వరకు విజయనగరం, కాకినాడ, తిరుపతి లోక్ సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది ఈ సంస్థ.
ఇప్పుడు తాజాగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలపై సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై అంచనాలను రూపొందించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, పరిపాలన విధానం, తీరుతెన్నులనూ తన సర్వే కోసం ప్రాతిపదికగా చేసుకుంది.
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరులో టీడీపీ కూటమికి కాస్త ఉపశమనం కలిగించేలా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. అమరావతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న వైఖరి వల్ల ఆయా జిల్లాల్లో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతున్నారు.
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అమరావతి రాజధాని ప్రాంతంలో 11 మంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని రైజ్ సంస్థ తెలిపింది. గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇక్కడ మాజీ శాసన సభ్యుడికే ప్రజలు జైకొట్టారని పేర్కొంది.
ఈ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ప్రస్తుత మంత్రులకు ప్రజల్లో పెద్దగా ఆదరణ ఉండట్లేదని తెలిపింది. వారికి అత్యల్ప మార్కులు పడినట్లు వివరించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అమరావతి రాజధాని ప్రాంతం నుంచి మంత్రివర్గంలోకి ఎంపికైన వారిలో నారా లోకేష్ (మంగళగిరి), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం), నాదెండ్ల మనోహర్ (తెనాలి), అనగాని సత్యప్రసాద్ (రేపల్లె), కొలుసు పార్థసారథి (నూజివీడు) ఉన్నారు.
తిరువూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నుంచి ఎన్నికైన శాసన సభ్యులు వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశం ఉందని రైజ్ సంస్థ అంచనా వేసింది. గన్నవరంలో వైఎస్ఆర్సీపీ సింపతీ రాజకీయం ఏ మాత్రం ప్రభావం చూపట్లేదని పేర్కొంది. వల్లభనేని వంశీ సొంత నియోజకవర్గం ఇది.
వైఎస్ఆర్సీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలను కలిగివుండటంతో మితిమీరిన ఇసుక దందా కారణంగా ఓ ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 2029లో ఓ జనసేన ఎమ్మెల్యేకు టికెట్ దక్కకపోవచ్చని, అలాగే- టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత ఉందని రైజ్ సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications