'సభలో రోజాకు భయపడే చంద్రబాబు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు'
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాకు మద్దతుగా అంబటి రాంబాబు ఆమె వెంట వచ్చారు.
రోజాకు అసెంబ్లీ సమావేశాలకు అనుమతి లేదంటూ మార్షల్స్ అడ్డుకున్న నేపథ్యంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు వికృతరూపం ఎలా ఉంటుందో రోజా సస్పెన్షన్ ఘటన చూసి ఏపీలోని ప్రజలు, మేధావులు అర్థం చేసుకోవాలని అన్నారు.

నిజానికి శాసనసభ వ్వవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం కూడదని అంటున్నారని, కానీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసినప్పుడు కోర్టులు చాలా సందర్భాల్లో జోక్యం చేసుకొని తీర్పులిచ్చాయని, వాటిని చట్టసభలు ఆమోదించాయని ఆయన చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను అడ్డుకోవడంపై చంద్రబాబు వ్యక్తిగతకక్ష పెంచుకున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కోర్టులు తీర్పులు ఇచ్చాయని, వాటిని సభలు గౌరవించాయని ఆయన గుర్తు చేశారు.

అయితే ప్రస్తుత స్పీకర్, ముఖ్యమంత్రి ఇప్పుడు వాటిని గౌరవించడం లేదని అన్నారు. వ్యవస్థలో వ్యక్తులు శాశ్వతం కాదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రోజాకు భయపడిన చంద్రబాబు చట్టాలను, న్యాయాన్ని కూడా ధిక్కరిస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు.
ఒక మహిళా ఎమ్మెల్యేపై ఇంతలా చంద్రబాబు కక్ష కట్టడానిక కారణం ఎంటో తెలియదన్నారు. గతంలోనూ సీఎంగా, ప్రతిపక్షనేతగా వ్యవహరించిన వ్యక్తి విచక్షణా జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. వాదనాలు విన్న తర్వాతే న్యాయమూర్తి తన ఉత్తర్వులు ఇచ్చారని, వాటిని గౌరవించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications