రెండో రోజు: వేడెక్కుతున్న ఆర్టీసి సమ్మె, ఘర్షణలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసి కార్మికుల సమ్మె రెండో రోజు గురువారం కొనసాగుతోంది. ప్రభుత్వాలు చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడపడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు.

వరంగల్ జిల్లాలోని హన్మకొండ బస్టాండ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. 2 డిపో నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీగా వస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ కార్మికుడు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో అతడిని పోలీసులు చితకబాదారు. దీంతో ఒక్కసారిగా కార్మికులంతా పోలీసులపై తిరగబడ్డారు.

ఓ ప్రైవేటు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. టైర్లను సైతం కార్మికులు తగులబెట్టారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

RTC workers strike continues

ఇదిలావుంటే, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమ్మెలో భాగంగా కొల్లాపూర్‌ డిపో ముందు గురువారం కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు అధికారులు యత్నించారు. దీంతో తాత్కాలిక డైవర్లు, కండక్టర్లపై కార్మికులు దాడి చేశారు. పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు రాజు, మల్లేష్‌ గాయపడ్డారు. రాజు అనే డ్రైవర్‌ తలకు తీవ్రగాయాలు కాగా, మల్లేష్‌ స్పృహతప్పి పడిపోవడంతో ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిపై లాఠీచార్జి జరపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

జిల్లాలోని గద్వాల మండలం గోనపాడులో బస్సు అద్దాలను కార్మికులు ధ్వంసం చేశారు. నారాయణఖేడ్‌లో నలుగురు ఆర్టీసీ కార్మికులు టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అమలు చేయాలంటూ వారు నిరసన చేపట్టారు. ఆర్టిసీ సమ్మెతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు నిజామాబాద్ఆర్టీసీ బస్టాండు వద్ద ధర్నా చేశారు. ఆర్టీసీ కార్మికులక బదులు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపడానికి అధికారులు ప్రయత్నించారు. అయితే, అధికారుల ప్రయత్నాన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకూ మధ్య వాగ్వాదం నెలకొంది.

కార్మికుల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ సమ్మె విరమించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసి సమ్మెను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లడాన్ని పొన్నం ప్రభాకర్ తదితర కాంగ్రెసు నాయకులు తప్పు పట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక సిబ్బందిని నియమించి కొన్ని బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించగా, ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనాన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. నర్సాపురం డిపోలో 25 బస్సులను పునరుద్ధరించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రాజమండ్రి డిపో బస్సుపై కార్మికులు దాడి చేసి టైర్లలో గాలి తీశారు.

పశ్చిమగోదావరి జిల్లా కోవూరు డిపో ఎదుట కార్మికులు తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 50 శాతం బస్సులను పునరుద్ధరించారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకున్న కార్మికనేతలను అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లాలో 60 బస్సులు నడిపారు. కడప జిల్లాలో తాత్కాలిక సిబ్బందితో 130 బస్సులు నడిపారు. విజయవాడ పాత బస్టాండ్‌ నుంచి సబ్‌కలెక్టరు ఆఫీసు వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ జరిపారు. నెల్లూరు బస్టాండులో బస్సులను అడ్డుకున్న 10 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, సమ్మె చేస్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం తాయిలాలు ప్రకటించింది. వెంటనే విధులకు హాజరైన కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్‌ చేస్తామని విజయనగరం రీజనల్ మేనేజర్ ఆర్ ఎం అప్పన్న ప్రకటించారు. విధులకు హాజరు కాని పక్షంలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఆర్‌ఎం అప్పన్న హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో 750 సర్వీసులు నిలిచిపోయాయి. సమ్మెలో 3,700 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. ఖమ్మం జిల్లాలో రెండో రోజు సమ్మె కొనసాగుతోంది. మణుగూరులో డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు బయటికి రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 10 డిపోల్లో 800 బస్సులు నిలిచిపోయాయి. డిపోల్లో నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికలు అడ్డుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపిస్తే సహించేంది లేదని కార్మికుల హెచ్చరించారు.

హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ బస్టాండ్‌లో తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున్న నిరసనకు దిగారు. బస్సులను రోడ్డుపై రానీయకుండా అడ్డుకున్న కార్మికులు ఈసీఐఎల్‌లో రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+