వైసీపీలోకి మాజీ ఐఏఎస్, సీఎం జగన్ పథకాల్లో కీలకపాత్ర - ఎంపీగా బరిలోకి..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో చేరికలు..జంపింగ్స్ మొదలయ్యాయి. మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎన్నికల వేళ రాజకీయంగా ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల రూపకల్పనలో విజయ కుమార్ కీలకంగా వ్యవహరించారు. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కలెక్టర్‌గా, పలు కీలక శాఖలకు సెక్రటరీగా పనిచేసిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటు, విద్యాశాఖలో ఇలా పలు శాఖల్లో తన పాత్ర పోషించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సెక్రటరీగా బాధ్యతల్లో ఉన్న విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసారు. ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రాజకీయాల్లో పూర్తిగా సీఎం జగన్ తో కలిసి నడవాలనే అభిప్రాయంతో విజయ్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరకముందే ఆయన తడ నుంచి తుని వరకు పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయ్ కుమార్ తాను కలెక్టర్ గా పని చేసిన నెల్లూరు, ఒంగోలు, విజయవాడలో దళిత, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈ రోజు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఆ యాత్రకు 'ఐక్యత విజయపథం' అని పేరు ఖరారు చేసారు. యాత్ర తరువాత విజయ్ కుమార్ వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు విజయ్ కుమార్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. బాపట్ల లేదా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. బాపట్ల, తిరుపతి నియోజకవర్గాల్లో వైసీపీకి సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. దీంతో వైసీపీలో చేరితే ఎక్కడ అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో పాలనా వ్యవహారాల పైన పట్టు ఉన్న అధికారి కావటంతో విజయ్ కుమార్ పార్టీలో చేరితే ఉపయోగకరమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications