కిరణ్‌కి సాయిప్రతాప్ షాక్, వారిని చూసి అభ్యర్థులు: డిగ్గీ
న్యూఢిల్లీ: జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ సోమవారం తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఉదయం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా డిగ్గీ మాట్లాడారు.
సాయి ప్రతాప్ తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరడం శుభ పరిణామం అన్నారు. మిగతా వారు కూడా కాంగ్రెసులోకి తిరిగి రావాలని కోరుతున్నానని చెప్పారు. ఎన్నికల వ్యూహంలో భాగంగానే తాము ఈ రోజు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నామని చెప్పారు. టిడిపి, తెరాస అభ్యర్థుల ఎంపికను పరిశీలించి తాము విడుదల చేస్తామన్నారు.

తాను అందరి ఆశీస్సులతో కాంగ్రెసు పార్టీలో ఉంటానని సాయి ప్రతాప్ చెప్పారు. పార్టీ ఆదేశిస్తే తాను మళ్లీ రాజంపేట నుండి పోటీ చేస్తానన్నారు. తనతో పాటు మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి పక్కా కాంగ్రెసు వాది అన్నారు.
తాను 36 ఏళ్లుగా కాంగ్రెసులో ఉంటే వారి కుటుంబం యాభై ఏళ్లుగా ఉందన్నారు. కిరణ్ వంటి వారిని దూరం చేసుకోవద్దని తాను అధిష్టానానికి సూచిస్తానన్నారు. విభజన విషయంలోనే కిరణ్ విభేదించారన్నారు. దిగ్విజయ్ ఢిల్లీకి రావాలంటూ తనను పిలిచారని... చిరంజీవి, బొత్స, రఘువీరాలు తనను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారన్నారు.
స్క్రీనింగ్ కమిటీ భేటీ
సీమాంధ్ర అభ్యర్థుల విషయమై డిగ్గీ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో చిరంజీవి, బొత్స సత్యనారాయణష ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications