టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ఎలాంటిదో తెలిపిన సజ్జల
Sajjala Ramakrishna Reddy: తెలుగుదేశం- జనసేన పార్టీ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి బీసీల అభ్యున్నతి గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. తన హయాంలో బీసీల కోసం ఏం చేశాడని ప్రశ్నించారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన వడ్డెర ఆత్మీయ సమావేశంలో సజ్జల మాట్లాడారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి, వడ్డెర కారొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి ఇందులో పాల్గొన్నారు.

పోటీ చేసే అవకాశం దక్కని నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారని, మంత్రి గుమ్మనూరి జయరాం కూడా అలాంటి వారేనని అన్నారు. వైసీపీకి రాజీనామా చేస్తే టీడీపీ ఆయనను చేర్చుకుందని చెప్పారు. జయరాం అక్రమాలు చేశారంటూ గతంలో చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేశారని, ఇప్పుడు ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని సజ్జల పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకపోవడం వల్లే గొడ్డలి పోటు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌తో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎస్సీ, బీసీ డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు బీసీలకు ఏమి చేశారని ప్రశ్నించారు. బీసీలు రాజకీయంగా ఎదగకుండా చేశాడని ధ్వజమెత్తారు. బీసీ డిక్లరేషన్ కాగితాలకే పరిమితమౌతుందని అన్నారు.
జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్‌లను చంద్రబాబు తయారు చేశారని, చివరికి మరుగుదొడ్ల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారంటూ మండిపడ్డారు.
2019లో చంద్రబాబును ప్రజలు సాగనంపారని, తమ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను లాక్కొని తొక్కాలని చూసినా జగన్ నిలబడ్డారని గుర్తు చేశారు. తన ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాలకు జగన్ 70 శాతం పదవులు ఇచ్చారని, అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications