విభజనపై స్టేకు సుప్రీం నో, కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో విభజనపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనతో విభేదించింది. విభజనపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. విభజనపై స్టే ఇవ్వాలని న్యాయవాదులు కోరితే, స్టే ఇవ్వలేమని కోర్టు తిరస్కరించింది.
విభజనపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి బదలీ చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. విచారణను బదలీ చేయాలా వద్దా అన్నది తదుపరి విచారణలో నిర్ణయిస్తామని చెప్పారు. కాగా, కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చాక తదుపరి విచారణ కొనసాగనుంది.
రాష్ట్ర విభజనపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా పదిహేడు మంది వరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపింది.

విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి, బిజెపి నేత రఘురామ కృష్ణం రాజు, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. విభజన సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని, 371డి సవరణ చేయకుండా ఎలా విభజిస్తారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను హెచ్ఎల్ దత్తు, ఎస్ఏ బోబ్డేలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
స్టే అడగలేదు: న్యాయవాది
అపాయింటెడ్ డే జూన్ 2న ఉన్నందున తాము సుప్రీం కోర్టును స్టే అడగలేదని ఓ న్యాయవాది చెప్పారు.
స్థానిక ఎన్నికలపై...
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహించాలని ఏప్రిల్ 18, 2013న తాము ఆదేశించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్త ం చేసింది. ఎంపిటిసి, జడ్పిటీసి ఎన్నికలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications