ఇదో రకం స్కామ్...గుంటూరు గిరిజన ఫైనాన్స్‌లో విచిత్రం:విచారణ షురూ!

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు:కుంభకోణాలు ఎన్ని రకాలుగా చేయొచ్చనేది అవినీతి సామ్రాట్టులకే తెలియని కొత్త కొత్త మార్గాలు తెలియచేప్పే విధంగా తయారయ్యారు కొన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు...స్కాములు వెలుగు చూసేంతవరకు ఈ తరహాలో కూడా కుంభకోణానికి పాల్పడవచ్చా?.. అనే విషయం నిఘా అధికారులు సైతం నివ్వెర పోయేలా ఉండటమే కొందరు గవర్నమెంట్ ఉద్యోగుల చేతివాటం గొప్పతనం. విషయానికొస్తే...

గుంటూరు జిల్లాలో తాజాగా వెలుగుచూసిన ఒక కుంభకోణం గురించి పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి బ్యాంకు సిబ్బంది చేతివాటం తోడైన స్పష్టంగా అర్థమవుతోంది. నైతిక విలువల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేసిన ఇక్కడి కొందరు ఉద్యోగులు నిబంధనలను తోసిరాజని అడ్డగోలుగా రుణాలు మంజూరు చేయడం ఒక విశేషమైతే...ఒక లబ్దిదారుడికి రుణం మంజూరు చేయాలంటేనే బ్యాంకుల చుట్టూ నెలల తరబడి వందలసార్లు తిప్పించుకునే బ్యాంకుల అధికారులు
ఒకే బ్రాంచ్ నుంచి రోజుల వ్యవధిలోనే వందలమందికి రుణాలు మంజూరు చేసేయడం మరో వింత. దీంతో ఈ అక్రమార్కుల ఆటలు మూడు స్కాములు...ఆరు కుంభకోణాల్లా భేషుగ్గా సాగిపోతోంది. వివరాల్లోకి వెళితే....

ఉద్యోగుల మాయాజాలం...ఇలా

ఉద్యోగుల మాయాజాలం...ఇలా

గుంటూరు జిల్లా గిరిజన ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పరిథిలో సబ్సిడీ రుణాల మంజూరుకు సంబంధించి కొందరు అధికారులు, ఉద్యోగులు మాయాజాలం ప్రదర్శించారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ వందలాది రుణాలను అడ్డగోలుగా మంజూరు చేసేశారు. ఈ శాఖ నుంచి ఒకే ఏడాదిలో ఒకే బ్యాంకు బ్రాంచి నుంచి 190 యూనిట్లకు అంగీకార పత్రాలు ఇవ్వగా, అధికారులు సైతం వాటిని ఏమాత్రం తనిఖీ చేయకుండా కళ్లు మూసుకొని అనుమతులు ఇచ్చేశారు. ఈ వ్యవహారం అనుకోకుండా వెలుగుచూడటంతో గిరిజన శాఖ, సదరు బ్యాంకు సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆ శాఖ జిల్లా అధికారితోపాటు, ఆ శాఖ ఉద్యోగుల పాత్ర, బ్యాంకు సిబ్బంది తోడ్పాటు ఉందంటూ ఆయా సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం విచారణ ప్రారంభమైంది.

 ఒకే బ్యాంకు...ఒకే బ్రాంచ్ నుంచి

ఒకే బ్యాంకు...ఒకే బ్రాంచ్ నుంచి

2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా షెడ్యూలు తెగల సేవా సహకార ఆర్థిక సంస్థ ద్వారా మంజూరు చేయబడిన మొత్తం రుణాల్లో 190 యూనిట్లకు గుంటూరు నగరంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఒకే బ్రాంచి లబ్ధిదారులకు విల్లింగ్‌ లెటర్స్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత గిరిజన శాఖ వారందరికీ రుణాలూ మంజూరు చేసింది. ఇందులో ఒక్కో యూనిట్‌ విలువ రూ.లక్ష కాగా మొత్తం సుమారుగా 2 కోట్లు మేర రుణం విడుదల చేయడం జరిగింది. నిబంధనల ప్రకారం ఒకే బ్రాంచి ద్వారా అన్ని యూనిట్లు మంజూరు చేయటం సాధ్యం కాదు. అలాగే గిరిజన శాఖ వైపు నుంచి చూసినా అన్ని మండలాలు, గ్రామాలకు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రుణాలను సమానంగా పంపిణీ చేయాల్సి ఉండగా ఒకే చోట పంపిణీ చేయడం కూడా సరి కాదు.

 అన్నీ అనుమానాలే...ఫిర్యాదులు

అన్నీ అనుమానాలే...ఫిర్యాదులు

ఒకేడాదిలో జిల్లాకు కేటాయించిన మొత్తం రుణాల్లో 25 శాతంపైగా రుణాలు ఒకే బ్రాంచి ద్వారా మంజూరు ఇవ్వటం అనుమానాలకు తావిచ్చింది. అయితే ఇవి సాధారణ రుణాలు కాదని, ఇదంతా ఒక పెద్ద కుంభకోణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ లబ్ధిదారులు, బ్యాంకర్లు, అధికారులు కుమ్మక్కై ఆ మొత్తం డబ్బును రుణాల పేరిట స్వాహా చేసేశారని గిరిజన సంఘాల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రుణాలు మంజూరు చేసిన కాలంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిగా నారాయణుడు ఉన్నారు. ఆయన తోపాటు, కార్యాలయంలో, రుణ విభాగంలో కీలకంగా వ్యవహరించే ఒక ఉద్యోగి పాత్ర కూడా ఇందులో ఉందని, అతనిపై మొదటినుంచి అవినీతి ఆరోపణలున్నాయంటున్నారు. అతన్ని 25 ఏళ్లకు పైగా ఒకే సీటులో ఉంచటం అతని పలుకుబడికి నిదర్శనం అంటున్నారు. సాధారణ లబ్దిదారుల నుంచి ఇక్కడి సిబ్బంది ఒక్కో రుణం మంజూరుకు కనీసంగా రూ.10 వేలు వసూలు చేస్తారని లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నారు.

 విచారణ...డిమాండ్

విచారణ...డిమాండ్

దీంతో ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు గుంటూరు నగరంపాలెంలోని గిరిజన ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి విచ్చేసిన ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చిన్నబాబు, ట్రైకార్‌ ఎజిఎం శశికళ బుధవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు. అసలు ఒకే బ్రాంచికి ఎందుకు అంత పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేశారని, నిబంధనలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. తర్వాత దశలో అసలు ఈ రుణాల లబ్ధిదారులు ఎవరు? వారు అర్హులేనా? అనే కోణంలో కూడా విచారణ చేయనున్నారని తెలిసింది. మరోవైపు ఈ శాఖలో అధికారుల విచారణ ప్రారంభమవడంతో అవినీతి అధికారులు, ఉద్యోగులు,బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలంటూ గిరిజన సంఘాల నాయకులు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Some officials and employees have demonstrated the corruption magic in subsidy loans in the Guntur District Tribal Finance Corporation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X