ఆపండి.. కాదు, కిరణ్‌ను కట్టడి చేయండి: దాదాకు వినతి
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీమాంధ్ర ప్రాంత మంత్రులు శనివారం కలిసి విభజన ప్రక్రియను ఆపాలని కోరగా, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోవాలని చూస్తున్నారని ఫిర్యాదు చేశారు.
సీమాంధ్ర ప్రాంత మంత్రులు కాసు వెంకట కృష్ణా రెడ్డి, రఘువీరా రెడ్డి తదితరులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ను కలిశారు. ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రణబ్‌కు చెప్పారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యవాదానికి అనుకూలంగా ఉన్నారని, తెలుగువారి ఆత్మగౌరవం నిలపాలంటే సమైక్యాంధ్రనే ఉంచాలని కోరారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణకు చెందిన పివి నరసింహా రావును ముఖ్యమంత్రిగా చేశారని, విభజనతో ఇరు ప్రాంతాలకు నష్టమని వారు చెప్పారు. విభజనను ఆపాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతికి చెప్పారు.

కిరణ్‌పై రాష్ట్రపతికి బిజెపి ఫిర్యాదు
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా, గడువులోపు పూర్తి కాకుండా కిరణ్ అడ్డుపడుతున్నారని రాష్ట్రపతికి బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ కోసం 1100 మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేశారని, పార్టీలు, మంత్రి మండలి రెండుగా చీలిపోయాయని వారు రాష్ట్రపతికి తెలిపారు.
ఈ సమయంలో విభజన ప్రక్రియ ఆలస్యం అయితే ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకుంటానని, అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయిస్తానంటూ కిరణ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చెప్పారు. కిరణ్‌ను కట్టడి చేయాలని కోరారు. రాష్ట్రపతిని కలిసిన బిజెపి నాయకుల్లో కిషన్ రెడ్డి, విద్యాసాగర రావు, నాగం జనార్ధన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications