విడదల రజిని విషయంలో వైఎస్ జగన్ కు ఊహించని షాక్!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్ లో మాజీ మంత్రి విడదల రజిని పై ఫిర్యాదు నమోదయింది. ఇది ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది.
విడదల రజినిపై ఫిర్యాదు
నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి విడదల రజిని పైన వైఎస్ఆర్సిపి డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో 2022లో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న తన పార్టీ కార్యాలయం ఇల్లు మరియు కారు పైన విడదల రజిని దాడి చేయించారని ఆయన ఆరోపించారు. దీనిపైన తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన తన ఫిర్యాదు ద్వారా కోరారు.

జగన్ న్యాయం చెయ్యాలి.. డిమాండ్
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఈ ఫిర్యాదు చేసి, ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన టికెట్ ను ఆయన మీడియాకు చూపించారు. ముందు జగన్మోహన్ రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని, తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్టు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని నమ్మకం కలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
విడదల రజిని చిలకలూరిపేటలో యాప్ ప్రారంభం.. ఆపై షాక్
తన ఇల్లు కారు పార్టీ కార్యాలయం పైన జరిగిన దానికి సంబంధించిన ఫోటోలను డిజిటల్ బుక్ యాప్ లో తన పేరుతో పాటు నమోదు చేశారు సుబ్రహ్మణ్యం. ఈ డిజిటల్ బుక్ యాప్ ను చిలకలూరిపేట లోని తన నివాసం వద్ద వైఎస్ఆర్సిపి నేతలు మరియు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి విడుదల రజిని ఆవిష్కరించారు. ఆవిష్కరించిన కొద్దిసేపటికే ఈ ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం.
ఆసక్తికరంగా మారిన విడదల రజినిపై ఫిర్యాదు
వైఎస్ఆర్సిపి ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ యాప్ లో సొంత పార్టీ నేత మాజీ మంత్రి అయిన విడదల రజిని పై ఫిర్యాదు రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటివరకు దీనిపైన విడదల రజిని స్పందించలేదు. అయితే ముందు ముందు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి డిజిటల్ బుక్ లో ఇంకా ఎంతమంది సొంత పార్టీ నేతల పైన ఫిర్యాదులు చేస్తారో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ను ప్రారంభించి ఇది కార్యకర్తలకు శ్రీరామరక్షలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఇందులో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలతో న్యాయం చేస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడ ఉన్నా చట్టం ముందు నిలబెట్టి శిక్షపడేలా చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.
జగన్ స్పందిస్తారా?
టిడిపి రెడ్ బుక్ గురించి మాట్లాడే వారికి, వైసిపి డిజిటల్ బుక్ యొక్క శక్తిని చూపిస్తామని వైయస్ జగన్ అన్నారు. అయితే జగన్ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ లో సొంత పార్టీ నేత మాజీ మంత్రి విడదల రజిని పై ఫిర్యాదు రావడంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications