తిరుమల తరహాలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు, టీటీడీ ఏర్పాట్లు తిరుపతి నుంచి స్పెషల్ బస్సులు !
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలు ఎలా నిర్వహిస్తారో అదే తరహాలో తిరుచానూరు లో శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీటీడీ ఛైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించామన్నారు. నవంబరు 9వ తేదీన అంకురార్పణ, 10వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని కరుణాకర రెడ్డి మీడియాకు చెప్పారు.

14వ తేదీన అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారని కరుణాకర రెడ్డి తెలిపారు. 18వ తేదీన పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని కరుణాకర రెడ్డి చెప్పారు. దాదాపు రూ. 9 కోట్లతో పంష్కరిణిని ఆధునీకరించి నీటితో నింపారని టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి తెలిపారు.
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి చైర్మన్ కరుణాకర రెడ్డి చేతుల మీదుగా భక్తులు 15 పరదాలను విరాళంగా అందించారు. హైదరాబాదుకు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన అరుణ్ కుమార్, శ్రీమతి పద్మావతి, తిరుచానూరుకు చెందిన శ్రీమతి పవిత్ర, శ్రీమతి రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ అధికారులు, శ్రీతిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications