అమరావతిపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు..!!
అమరావతిపై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం పైన ఛార్జ్ షీటు విడుదల చేస్తామని వెల్లడించారు. మే 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు.
ఏపీలో ఓటు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందన్నారు. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారని..బీజేపీ అమరావతికి కట్టుబడి ఉందని సోము వీర్రాజు స్పష్టం చేసారు. కేంద్రం అమరావతిలో నిర్మాణాలకు నిధులు ఇస్తే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.

ఏపీలో బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర సహా ఇంఛార్జ్ సునీల్ దేవధర్ పలు సూచనలు చేసారు. సాధారణ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు. రాష్ట్రంలో కేవలం బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని ప్రజలకు చెప్పాలని సూచించారు. కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడతామని.. బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఈ విషయాలు చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
గుంటూరులో పోయిన వాళ్ల గురించి ఆలోచన వద్దని, తులసి రామచంద్ర ప్రభు వచ్చారన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డివంటి పెద్ద నాయకులు బీజేపీలోకి వచ్చారన్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో ఒవైసీ సోదరుల అరాచకాలు అడ్డుకున్నది కిరణ్ కుమార్ రెడ్డేనని సునీల్ దేవధర్ పేర్కొన్నారు.
గుంటూరులో జిన్నా టవర్‌కు ఆ పేరు ఉండటానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రెడ్డికి జిన్నా అంటే అంత ప్రేమ కేవలం ఓట్ల కోసమేనని ఆరోపించారు. హిందూ వ్యతిరేక విధానాలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదన్నారు. రాష్ట్రంలో తెలుగు మీడియం రద్దును బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి పైన కొందురు ప్రశ్నిస్తున్నారని..తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని చెప్పారు.
తాము ఏ పార్టీతోనూ ఉండాల్సిన అవసరం లేదని..ప్రజలతో మాత్రమే ఉంటామన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలనే రూ 2500 కోట్లు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేసారు. అక్కడే ఆర్బీఐ, నాబార్డు కార్యాలయాలకు స్థలాలు తీసుకున్నట్లు వివరించారు. అమరావతి కట్టే దమ్ములేని వాళ్లు తమ పైన మాట్లాడుతున్నారని వీర్రాజు ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications