ఎవర్నీ తొక్కేయలేదు, ఏపీ ప్రత్యేకమే: సోము, ‘బిజెపిలానే కెసిఆర్ కూడా’
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు ఇటీవల ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రమేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో కొందరు బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడే హోదా సంజీవని ఏమీ కాదని అన్నారని గుర్తు చేశారు.
చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపై తాను విమర్శలు చేయడం లేదని చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం తన ఉద్దేశం కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో రూ. 700 కోట్ల నిధులు మాత్రమే వస్తాయని, అవే ఏపీకి సరిపోతాయా? అంటూ ప్రశ్నించారు.

ఏపీకి కేంద్రం అంతకంటే ఎక్కువ నిధులే ఇస్తోందని వివరించారు. బిజెపిపై వ్యతిరేకత పెంచేలా కొందరు మాట్లాతుండటంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.
కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చు చేయకుండానే మరిన్ని నిధులు కావాలంటే ఎలా అని సోము వీర్రాజు ఏపి సర్కారుని ప్రశ్నించారు. విద్యుత్, రవాణా, పేదలకు ఇళ్లు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించేందుకు కేంద్రం సహాయం అందిస్తోందని వివరించారు.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయవాడలో ఫ్లై ఓవర్ వేయించుకోలేదని అన్నారు. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించారని, పలు జిల్లాల నుంచి అమరావతికి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.
కేంద్రం లక్షా 40వేల కోట్ల మేర నిధులు మంజూరు చేసినట్లు చెబుతుండగా, టిడిపి ప్రభుత్వం మాత్రం 7వేల కోట్లే అందాయని చెప్తున్నాయని ప్రశ్నించగా.. లెక్కలు తేలతాయన్నారు.
తాను అసలుసిసలైన బిజెపి కార్యకర్తనని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తాను ఎవరినీ తొక్కేయలేదని చెప్పారు. తాను కిందిస్థాయి నాయకులను ప్రోత్సహించించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు.
2019లో టిడిపితో పొత్తు విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అప్పుడు ఎక్కువ సీట్లు అడిగితే టిడిపి ఇస్తోందో లేదో చెప్పలేమని అన్నారు. సామాజిక వర్గాలతో బిజెపి ఎప్పుడూ రాజకీయాలు చేయదని చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా మరో పార్టీని బలహీనపర్చే ప్రయత్నం చేయలేమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాలకు అనుకూలమని అందుకే దేశంలో పలు రాష్ట్రాలను విభజించిందని తెలిపారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బిజెపి నమ్ముతుందని తెలిపారు. తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు కూడా పెద్ద జిల్లాలను అధికార వికేంద్రీకరణ కోసం చిన్న జిల్లాలుగా విభజిస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు.












Click it and Unblock the Notifications