ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ జోరు- బీజేపీ కంచుకోట బద్దలవుతుందా ?
ఒకప్పుడు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల కోసం వ్యూహాలు రచించి గెలిపించిన చరిత్ర ఉన్న ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఆ తర్వాత బీహార్ లో సొంతంగా జన్ సురాజ్ పార్టీ స్థాపించినా పోటీ చేయలేదు. తన పార్టీ తరఫున అభ్యర్ధుల్ని నిలబెట్టినా అంతా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన బంకీపూర్ సీటుకు ఉప ఎన్నిక రావడంతో ఉన్నట్లుండి బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ మధ్యే జరిగిన ఈ ఉపఎన్నిక కౌంటింగ్ ఇవాళ జరుగుతోంది. ఇందులో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గత సోమవారం జరిగిన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఇందులో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆరంభం నుంచీ ఆధిక్యంలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి, ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా కంటే 3451 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మూడు రౌండ్ల తర్వాత ప్రశాంత్ కిషోర్ 11వేల పైచిలుకు ఓట్లు సాధించగా, సిన్హా దాదాపు 7వేల ఓట్లు పొందారు, ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా మూడవ స్థానంలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 31 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బంకీపూర్ సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆర్జేడీకి చెందిన రేఖా గుప్తాపై 50 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన నబిన్.. వరుసగా ఐదోసారి ఈ సీటును నిలబెట్టుకున్నారు. ఈసారి కూడా ఆర్జేడీ అభ్యర్థిగా రేఖాగుప్తానే బరిలో నిలిచినా, నబీన్ స్ధానంలో నీరజ్ సిన్హాను బరిలోకి దింపినా, ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ పైనే అందరి దృష్టీ నెలకొంది. 1995లో పాట్నా వెస్ట్ నుంచి బంకీపూర్ గా మారిన తర్వాత బీజేపీ ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తోంది. దీంతో నితిన్ నబీన్ స్ధానంలో ఇక్కడ బీజేపీ యువ నేత నీరజ్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా బరిలోకి దించింది. అయినా ఆయన తొలి రౌండ్లలో ఆధిక్యం అందుకోలేకపోయారు.














Click it and Unblock the Notifications