Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తి ఎంతో తెలుసా ? తొలిసారి వెల్లడి..!
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) తొలిసారి తన ఆస్తుల్ని వెల్లడించారు. బీహార్ లో జన్ సురాజ్ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా, 234 మంది అభ్యర్ధుల్ని బరిలోకి దించి ఒక్క సీటు కూడా గెలవని పీకే.. ఇప్పుడు అనూహ్యంగా బంకీపూర్ ఉపఎన్నికల బరిలో దిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన ఈ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న పీకే.. తన అఫిడవిట్ లో ఆస్తుల్ని ప్రకటించారు.
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తనకు రూ.96 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.22.19 కోట్ల విలువైన చరాస్తులు రూ.73.87 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అస్సాంకు చెందిన వైద్యురాలైన ఆయన భార్య జాహ్నవి దాస్ వద్ద రూ.89.51 కోట్ల చరాస్తులు, రూ.12.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.102 కోట్లు ఆస్తులున్నట్లు తెలిపారు. బంకీపూర్ లో పోటీకి ఇది కేవలం తన నామినేషన్ మాత్రమే కాదని, బీహార్‌లో రాజకీయ మార్పు కోసం ఒక పిలుపు అని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. ఇక్కడ నేర చరిత్ర ఉన్నవారు తమ పదవులను వదులుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రశాంత్ కిషోర్ అఫిడవిట్ ప్రకారం, ఆయనకు ప్రస్తుతం రూ. 5.77 కోట్ల బ్యాంక్ రుణం కూడా ఉంది. ఆయన భార్య పేరు మీద రెండు ఫ్లాట్లు, గౌహతిలోని ఒక బంగళాలో మూడింట ఒక వంతు వాటా, నోయిడాలో అదనపు ఆస్తి ఉన్నాయి. కిషోర్ స్వయంగా ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో రెండు ఫ్లాట్లు, మరో రెండు ఫ్లాట్లలో 50% వాటా కలిగి ఉన్నారు. అలాగే పాట్నాలోని పాటలీపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ప్లాట్లు, బక్సర్, తన పూర్వీకుల గ్రామంలో ఆస్తులను కలిగి ఉన్నారు.
అలాగే 'వేధా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్' యజమానిగా కూడా ఉన్నారు. ఈ సంస్థ 2024-25లో 'జన్ సురాజ్'కు రూ. 85 కోట్లు విరాళంగా ఇచ్చింది.















Click it and Unblock the Notifications