కాంగ్రెస్‌లో 'ప్రత్యేక' చిచ్చు: మాకు నష్టమని గుత్తా, నీకేంటని రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌తో పాటు పార్టీ అధిష్ఠానం డిమాండ్ చేస్తుండగా, ఏపీకి ఆ హోదా ఇవ్వొద్దని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ విషయమై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెండ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆయనకేం నష్టమని ప్రశ్నించారు. గుత్తాపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమని, ఇక్కడి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతాయని గుత్తా ఆందోళన వ్యక్తం చేశారు.
రేవులు, పరిశ్రమలు, ఇతరత్రా సౌకర్యాలకు దూరంగా ఉన్న, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారని, హిమాలయ రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలే దీనికి అర్హమైనవని, కానీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తగదని, అంతర్జాతీయ సరిహద్దు ఉన్న, వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌కు విభజన తర్వాత కూడా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించలేదని గుత్తా తన లేఖలో పేర్కొన్నారు.

రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ లొంగలేదని, ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే వాదనకు ఎలాంటి బలమైన ప్రాతిపదిక లేదని, ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని, విశాఖ ఉక్కుతో సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలున్నాయని, రేవులు, తీరప్రాంతం ఏపీ సొంతమని, కృష్ణా, గోదావరితోపాటు అనేక నదులతో వ్యవసాయరంగంలోనూ ముందుందని పేర్కొన్నారు. ఇంకా ఎన్నో ఉన్నాయని ఆయన లేఖలో రాశారు.
దీనిపై రఘువీరా రెడ్డి భగ్గుమన్నారు. ఈ విషయమై సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ తదితరులతో మాట్లాడారు. వెనువెంటనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సమయంలో యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
నాడు మన్మోహన్ సింగ్ కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేశారని, ఇటీవల లోకసభ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదా హామీని ఏం చేశారంటూ మీరు ఎన్డీయే సర్కార్‌ను నిలదీశారని, ఇటు రాష్ట్రంలోనూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యేక హోదా కోసం పార్టీ శ్రేణులు ఆందోళనలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నాయని, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రజలూ మన ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారని, ఇలాంటి తరుణంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దంటూ గుత్తా లేఖ రాయడం ఏమిటన్నారు.












Click it and Unblock the Notifications