ఆమ్లెట్ విషయంలో అత్తా- కోడళ్ల గొడవ.. మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్య !!
మనుషులు క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, నియంత్రించుకోలేని కోపం ఒక్కోసారి ఊహించని ఘోరాలకు దారితీస్తాయి. ఈ తరహా ఘటనే శ్రీకాకుళంలోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపుతోంది. అత్తాకోడళ్ల మధ్య ఆమ్లెట్ విషయంలో తలెత్తిన ఓ చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారింది. అత్త వేధింపులు.. భర్త మౌనం ఆ గృహిణిని క్రుంగదీశాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారంపేటకు చెందిన కోనాడ నాగరాజుకి.. పొందూరు మండలం బొడ్డేపల్లికి చెందిన షర్మిలతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు ఉమ్మడి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అయితే పెళ్లయిన నాటి నుంచి అత్తకి, కోడలికి మధ్య తరచూ చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుండేవని అంటున్నారు. అయితే భర్త నాగరాజు మాత్రం వాటిలో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండేవాడని తెలుస్తోంది.

అయితే ఈ నెల 8వ తేదీన నాగరాజు పని ముగించుకుని ఇంటికి రాగా, భర్తకు భోజనం వడ్డిస్తూ షర్మిల ఒక ఆమ్లెట్ వేసి పెట్టింది. కానీ తన చిన్న కొడుకుకు ఆమ్లెట్ ఎందుకు వేయలేదంటూ అత్త దమయంతి కోడలితో గొడవకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో కూడా నాగరాజు ఏమీ మాట్లాడకపోవడంతో షర్మిల తీవ్రంగా నొచ్చుకుంది. ఈ క్రమంలోనే భర్త తనకు అండగా నిలబడకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది.
దాంతో అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయాన్నే షర్మిల విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమ్లెట్ కోసం మొదలైన గొడవ చివరికి ఒక ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications