2న టి అఖిలపక్షం: ఒక్కటిగా పోవాలని కెసిఆర్, జానా

తెరాస, కాంగ్రెసులతో పాటు టిటిడిపి, బిజెపి, సిపిఎం, సిపిఐ పార్టీలతో అఖిల పక్షం నిర్వహించాలని, అందులో అన్ని పార్టీలు ముసాయిదా బిల్లు పైన కలిసి వెళ్లే విషయంపై చర్చించాలని నిర్ణయించారు. బిల్లు పైన ఏ పార్టీకి ఆ పార్టీ వేర్వేరుగా వెళ్తే తెలంగాణ ప్రాంతానికే నష్టమని కాబట్టి, అన్ని పార్టీలను కలుపుకొని వెళ్దామని భేటీలో వారు అభిప్రాయపడ్డారు. ఈ భేటీలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, మంత్రులు సారయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లులో అనేక సవరణలు చేయాల్సి ఉందని, లేదంటే తెలంగాణకు నష్టమని, సవరణల తర్వాతనే బిల్లు పార్లమెంటుకు వచ్చేలా చూడాలని, జివోఎం చెప్పని పలు విషయాలను కూడా బిల్లులో చేర్చారని ఈ సందర్భంగా జానాతో కెసిఆర్ అన్నారు. కేంద్రం ఒకటి చెబుతూ మరొకటి చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో, పార్లమెంటులో టి నేతలమంతా కలిసి పోరాడుదామన్నారు.
భేటీ అనంతరం జానా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలు వేరైనా తెలంగాణ ప్రాంత నేతల లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన ఒకటే అన్నారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగకూడదన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు నైతికత లేదని మధుయాష్కీ మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతికి ఇచ్చిన అఫిడవిట్లతో ఒరిగేదేమీ లేదన్నారు. అప్పులన్నింటిని తెలంగాణపై వేసే కుట్ర జరుగుతోందన్నారు.












Click it and Unblock the Notifications