టీడీపీ నుంచి కేశినేని నాని ఔట్ - అటు వైపే చూపు, చిన్నికి క్లియర్..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు కొనసాగుతున్న వేళ..టీడీపీలో సీట్ల రచ్చ మొదలైంది. విజయవాడ టీడీపీ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి ఈ సారి ఎన్నికల్లో సీటు లేదని చంద్రబాబు తేల్చేసారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. దీంతో నాని టీడీపీలో కొనసాగటం సందేహంగానే ఉంది. దీంతో నాని అడుగులు ఏంటనే చర్చ మొదలైంది.
నాని పై చంద్రబాబు నిర్ణయం: విజయవాడ టీడీపీలో ఎన్నికల వేళ చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నానికి సీటు లేదని తేల్చేసారు. పార్టీ కార్యక్రమాల్లో అంతగా జోక్యం చేసుకోవద్దని చెప్పటం ద్వారా దాదాపుగా నానిని పక్కన పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా నాని వెల్లడించారు. కొంత కాలంగా నాని వ్యవహార శైలి పైన పార్టీలో చర్చ సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ చేస్తానని, లేకుంటే స్వతంత్రగా పోటీలో ఉంటానని గతంలోనే నాని స్పష్టం చేసారు. దీంతో, కేశినేని నానికి ఇది అవమానంగా ఆయన మద్దతు దారులు భావిస్తున్నారు. కేశినేని నాని గతంలోనే వైసీపీ లో చేరేందుకు ఆఫర్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ వైసీపీ వైపు చూస్తారా..లేక స్వతంత్రంగానే బరిలో నిలుస్తారా అనేది తేలాల్సి ఉంది.
నానికి ఈ సారి నో టికెట్: వైసీపీ ఈ సారి విజయవాడ నుంచి బీసీ అభ్యర్దిని పోటీకి దింపాలని నిర్ణయించింది. టీడీపీ నుంచి ఈ సారి కేశినేని స్థానంలో కేశినేని చిన్నికి అవకాశం ఇవ్వటం ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. తాజాగా తిరువూరు లో జరిగిన ఘటనతో ఇక కేశినేని నాని విషయంలో నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావించింది. ఇదే సమయంలో నానికి సీటు ఇవ్వటం లేదని..నాని కుమార్తెకు మైలవరం సీటు ఇచ్చేలా ప్రతిపాదన ఉందని చెబుతున్నారు.
కానీ, నాని తనకు సీటు లేనప్పుడు తన కుమార్తెకు వద్దని చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్టీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న విజయవాడ సీటును జనసేన లేదా బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా లేరని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్దే పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

నాని అడుగులు ఏటు వైపు: ఇక, అటు నానికి ప్రాధాన్యత తగ్గిస్తూనే ఇదే సమయంలో చిన్నికి బాధ్యతలు అప్పగించారు. కొంత కాలంగా చిన్ని ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర సమయంలో నాని దూరంగా ఉండగా..చిన్ని యాక్టివ్ గా పని చేసారు. తాజాగా పవన్ కల్యాణ్, లోకేష్ తో సమావేశమై తన అభ్యర్దిత్వానికి ఆమోద ముద్ర వేయించుకున్నారు.
నాని పైన చర్యలకు కొంత కాలంగా వేచి చూస్తున్న టీడీపీ నాయకత్వం తిరువూరు ఘటన తరువాత అసలు విషయం బయట పెట్టింది. ఇప్పుడు తిరువూరు సభ ఏర్పాట్ల బాధ్యతలను చిన్నికి అప్పగించింది. దీంతో..ఎంపీ సీటు చిన్నికే ఇస్తారనే అంచనాలు పెరిగాయి. ఇక, చిన్ని సీటు ఖరారు అయితే...కేశినేని నాని అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications