సీఐడీ కార్యాలయంలో చంద్రబాబు..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా సీఐడీ నమోదు చేసిన కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలోనే కొన్ని షరతులు నిర్ణయించింది. అందులో భాగంగా చంద్రబాబు తన కేసులు విచారిస్తున్న సీఐడీ కార్యాలయానికి వచ్చారు. కోర్టు సూచనల మేరకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఉచిత ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక కేసులో సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు. అనంతరం ఐఆర్‌ఆర్ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయాలకు వెళ్లి పూచీకత్తు, బాండ్లు సమర్పించారు.

చంద్రబాబు రాక సందర్భంగా సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే అక్కడకు భారీగా చేరుకున్న టీడీపీ అభిమానులు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు వచ్చారు. చంద్రబాబుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని నినాదాలు చేశారు. ఇదే కేసుల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీరికి సైతం హైకోర్టు మందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకున్న చంద్రబాబును చూసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎగబడ్డారు. అందరికీ అభివాదం చెబుతూ చంద్రబాబు సీఐడీ కార్యాలయంలోకి వెళ్లారు. స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు క్వాష్ పిటీషన్ పైన విచారణ పూర్తయింది. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు పైన కేసుల్లో ఈ తీర్పు కీలకం కానుంది.












Click it and Unblock the Notifications