యువకుల్ని హంతకులుగా చేస్తోంది: చంద్రబాబు
గంజాయి రాష్ట్రంలోని యువత ప్రాణాలు తీస్తోందని, వారిని హంతకులుగా మారుస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. విజయవాడ గంజాయి సంఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం విచ్చలవిడిగా మారిందని, యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా ఏకంగా ప్రాణాలు కూడా తీస్తోందన్నారు.
విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసిందని.. మరో ఐదుగురిని హంతకులగా చేసిందని, దీనికి ప్రభుత్వ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. గంజాయిని అరికట్టే విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటుందని, ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళుతుందో అధికారులు అర్థం చేసుకోరా? అన్నారు. గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దని, పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

విజయవాడ సమీపంలో జరిగిన ఓ హత్య ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. ఐదుగురు యువకులు గంజాయి మత్తులో అజయ్ సాయి అనే యువకుడిపై దాడిచేయడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు సాయిని పటమట డొంకరోడ్డులో ఉన్న ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కంకిపాడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే సాయి శరీరంపై ఉన్న గాయాలు యాక్సిడెంట్ అయిన గాయాలు కాకపోవడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అజయ్ సాయి చికిత్స పొందుతూ మరణించాడు. పెనమలూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications