అక్కడ పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఏపీ , తెలంగాణలో హడావుడి తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పొత్తులో పోటీ చేస్తోంది. బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తోంది ఆ పార్టీ.
చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అయితే తెలంగాణకు సంబంధించి మాత్రం చంద్రబాబు ఇప్పటి వరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. తెలంగాణలో ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా టీడీపీ తప్పుకోనుందని తెలుస్తోంది.

ఏపీలో బీజేపీ , జనసేన పార్టీలతో పొత్తులో ఉన్న చంద్రబాబు..తెలంగాణలో మాత్రం తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు అంతా కూడా కాంగ్రెస్‌కు మళ్లేలా ప్లాన్ చేశారు. ఇప్పుడు కూడా టీడీపీ అదే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఆయన పార్టీ వీడి నాలుగు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడు నియామకం గురించే చర్చ జరిగింది లేదు.
పోటీపై అధినేత చంద్రబాబు నుంచి ఎటువంటి హామీ దక్కకపోవడంతో లీడర్లు , క్యాడర్ పూర్తి నిరాశలో కురుకుపోయారు. ఇప్పటి వరకు పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష కూడా నిర్వహించలేదు. దీంతో తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నట్టే అని అందరు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటే ఇది ఆ పార్టీ జాతీయ హోదాపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఒక్క సీటు కూడా లేకపోతే టీడీపీకి జాతీయ హోదా రద్దు అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు వైఖరి ఏమిటి అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు.












Click it and Unblock the Notifications