ఈసీ ఉత్తర్వులు మన కోసమే: బయట పెట్టిన అయ్యన్న: సైకో రెడ్డిని వదలం
Ayyanna Patrudu: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలను పంపించారు. ఎవ్వర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఈ ఉదయం నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అయిదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములన్నింటినీ ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఆక్రమణదారులు ఎంత పెద్ద వాళ్లైనా, చివరికి ఐఎఎస్ అధికారులైనా వదిలపెట్టబోమని, కటకటాల వెనక్కి పంపిస్తామని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని సైకోలుగా అభివర్ణించారు చింతకాయల. ఆ సైకో రెడ్డిని వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు. జ్యుడీషియరీ ఎంక్వైరీ వేసి వాళ్లందర్నీ జైలుకు పంపిస్తానని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, వాటిని చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు.
వైఎస్ జగన్ ఇంట్లో ఈ పాటికి టీవీలన్నీ బద్దలయిపోయి ఉంటాయని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడా బాణాసంచా కాల్చకుండా, విజయోత్సవ ర్యాలీలు తీయకుండా ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు.
అలా జరిగివుంటే ర్యాలీల పేరుతో వైసీపీ నాయకులు అల్లర్లకు పాల్పడేవారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇళ్లకు వెళ్లి చంపేసే వారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులను ఈసీ తమ కోసమే ఇచ్చందని తేల్చి చెప్పారు. మనం గెలిచిన సంతోషంలో ఉన్నామని, దాన్ని హరించడానికి వైసీపీ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు.
ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారని, అప్పటివరకు ఓపిక పట్టాలని అయ్యన్న పార్టీ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని బాగుపర్చడం, ప్రజలకు అండగా ఉండటం చంద్రబాబు పని అని, మిగిలినవి తాము చూసుకుంటామని అన్నారు అయ్యన్న.












Click it and Unblock the Notifications