వైసీపీలో చేరికపై తేల్చేసిన మరో టీడీపీ నేత..!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాకముందే, రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో, ఎవరూ ఊహించని విధంగా కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) భారీ విజయాన్ని నమోదు చేసి, ఏకంగా 164 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) గతంలో సాధించిన 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయింది.
ఈ పరాజయంతో వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని అంతా భావించారు. అయితే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనూహ్యంగా ఈ దారుణ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్నట్టు కనిపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే, జగన్ మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. పైగా ఈ ఏడాది కాలంలోనే కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత మొదలైందని పలు సర్వేలు సైతం స్పష్టం చేశాయి. ముఖ్యంగా కేకే సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమిలో చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. ఇటువంటి సమయంలో వైసీపీలో చేరికలు మొదలయ్యాయి.

గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఆహ్వానించారు జగన్. ఈక్రమంలోనే మరో టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
2009,2014 ఎన్నికల్లో మైలవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఉమా, 2014 టీడీపీ ప్రభుత్వంలో జిల్లా మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యే వసంత వైసీపీని వీడి టీడీపీలో చేరడమే కాకుండా టికెట్ కూడా దక్కించుకున్నారు. దీంతో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమాకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం దేవినేని ఉమా రాజకీయ నిరుద్యోగిగా మిగిలారు.
ప్రజలు 11 సీట్లతో బుద్ధిచెప్పినా @ysjagan ఫేక్ ప్రచారాలు మానలేదు. నీ పార్టీ ఉనికి కాపాడు కోవడం కోసం ఇంతలా దిగజారాలా? ముఖ్యమంత్రి @ncbn, మంత్రి @naralokesh ల ఏడాది సుపరిపాలనా తీరుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029 లో వైసీపీ సింగిల్ సీటు… pic.twitter.com/cPdwHeXMEm
— Devineni Uma (@DevineniUma) June 23, 2025
ఈ నేపథ్యంలో దేవినేని ఉమా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన..'ప్రజలు 11 సీట్లతో బుద్ధిచెప్పినా వైఎస్ జగన్ ఫేక్ ప్రచారాలు మానలేదు. నీ పార్టీ ఉనికి కాపాడు కోవడం కోసం ఇంతలా దిగజారాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల ఏడాది సుపరిపాలనా తీరుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029 లో వైసీపీ సింగిల్ సీటు గెలుచుకోవడం కూడా కష్టమే' అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్వీట్ చేశారు. దీంతో దేవినేని ఉమా పార్టీ మారడం లేదని తేలింది.. తాను టీడీపీలో కొనసాగుతానని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications