Tdp Mahanadu 2025: ఈసారి కడపలో 10కి 10 కొడతాం-చంద్రబాబు ప్రకటన..!
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అరుదైన ఫీట్ సాధించింది. రాయలసీమ ప్రాంతంలో ఎన్నడూ లేని స్ధాయిలో సీట్లను గెల్చుకుంది. దీంతో అంతకు ముందు ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఫీట్ ను తిరగ రాసింది. అంతే కాదు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో సైతం అనూహ్య ఫలితాలు సాధించింది. ఈ జిల్లాలో మొత్తం 10 సీట్లకు గానూ ఏడు సీట్లు గెలిచి సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.
కడప జిల్లాలో టీడీపీ విజయాలపై టీడీపీ మహానాడులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చరిత్ర సృష్టించబోతోందని చంద్రబాబు తెలిపారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన గెలుపు అసామాన్యమని బాబు తెలిపారు. కడప జిల్లాల్లో 10 సీట్లకు ఏడు గెలిచామని, వచ్చేసారి పదికి పది గెలవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మహానాడు ఏపీ దశ, దిశను మార్చబోతోందన్నారు.

రాయలసీమలో ప్రజలు తమకు గత ఎన్నికల్లో అద్భుత విజయాలు కట్టబెట్టారని, వారికి కృతజ్ఞతగానే కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. తొలిసారి దేవుని గడప అయిన కడపలో మహానాడు నిర్వహించడం, అందునా కూటమి తొలిసారి విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇక్కడ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న టీడీపీ కార్యకర్తలందరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications