సస్పెన్షన్ తీర్మాన కాపీపై వాగ్వాదం, కోర్టులో రోజా భవిష్యత్తు తేలేది రేపే
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శితో ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ దాఖలు చేయించింది. దీనిపై సోమవారం వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా రోజా, అసెంబ్లీ కార్యదర్శి లాయర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి తన క్లయింట్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేసిన స్పీకర్... సదరు సస్పెన్షన్ తీర్మానం కాపీని మాత్రం ఇవ్వలేదని రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆరోపించారు.
తీర్మానం కాపీ కూడా ఇవ్వకుండా తన క్లయింట్ హక్కులను కాలరాశారన్నారు. దీంతో అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు విపించేందుకు వచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావు... జైసింగ్ వాదనను కొట్టిపారేశారు. తీర్మానం కాపీని రోజాకు ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయవాదుల మధ్య ఒకింతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, రోజా సస్పెనన్షన్ పైన హైకోర్టులో వాదనలు ముగిశాయి, రేపు తీర్పు రానుంది.

సభలో రోజా అంశంపై చర్చ
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు నేపథ్యంలో శాసన సభలో రోజా సస్పెన్షన్ అంశంపై చర్చ సాగుతోంది. టిడిపి ఎమ్మెల్యే శివాజీ మాట్లాడారు. ఆయన రోజా తీరు పైన ఆవేదన వ్యక్తం చేశారు.
శివాజీ మాట్లాడుతూ.. సభా నియమాలపై కొత్త సభ్యులు అవగాహన పెంచుకోవాలన్నారు. రాజ్యాంగానికి లోబడి దేశంలో ప్రతి వ్యవస్థ పని చేయాలన్నారు. రాజ్యాంగానికి లోబడే రోజాపై చర్యలు తీసుకున్నామా లేదా అని విశ్లేషించుకోవాలన్నారు. పరిస్థితులను బట్టి కొన్ని సవరణలు జరుగుతాయన్నారు.
రోజా వ్యాఖ్యలు పరాకాష్టకు నిదర్శనం అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. రోజా ఏనాడు ప్రజా సమస్యల పైన మాట్లాడలేదన్నారు. సభలో ఆమె హావభావాలు ఏమాత్రం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications