మీ సమస్యే నా సమస్య: టిడిపి ఎంపీలతో ప్రధాని, జేసీ నమ్మకం
న్యూఢిల్లీ: 'మీ సమస్యే నా సమస్య' అని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చెప్పినట్లు ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. హోదా కోసం చేస్తున్న ఆందోళన ఈరోజటిది కాదని చెప్పారు.
ప్రధాని తమతో సుమారు 10 నిమిషాలకుపైగా మాట్లాడారని చెప్పారు. ఏపీకి ఏదో చేయాలనేది మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ మనసులో ఉందని తెలిపారు. అది హోదానా లేక ఆర్థిక సాయామా? అని చెప్పలేనని చెప్పారు. ఏపీకి ఆర్థిక ప్రయోజనం చేకూరేలా కేంద్రం చేస్తుందని అన్నారు.

గతంలోనే పార్లమెంటులో ఏపీకి హోదా ఇవ్వాలని ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని, ఇతర రాష్ట్రాలు ఇందుకు అభ్యంతరం చెప్పవని అన్నారు. బిజెపి కూడా గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు వెనక్కిపోవడం భావ్యం కాదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
ఏపీలోని సామాన్యులకు హోదా అంటే తెలియకున్నా.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరూ ఏపీకి హోదా కావాలంటున్నారని చెప్పారు. ఇది ఏపీ ప్రజల సెంటిమెంట్ అని జేసీ చెప్పారు. హోదా కాకుండా ఏం చేసినా ఏపీ ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications