కీలక నియోజకవర్గంలో TDP అభ్యర్థి ఖరారు?
వచ్చే ఎన్నికల్లో విజయం తప్ప వేరే ఆప్షన్ తెలుగుదేశం పార్టీకి లేదు. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు తన సహజ స్వభావానికి భిన్నంగా దూకుడైన రాజకీయం చేస్తున్నారు. ఇప్పటివరకు 156 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించి కొంతమంది అభ్యర్థులను ముందే ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. పనితీరు బాగోలేనివారికి, తాను చేయించుకున్న సర్వేలో తక్కువ మార్కులు వచ్చినవారికి మాత్రం సీటు విషయమై గ్యారంటీ ఇవ్వడంలేదు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ సీటు ఆశిస్తున్నారు. అంతేకాదు.. నంద్యాల కూడా అధినేతను అడుగుతున్నారు. తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిని నంద్యాల నుంచి పోటీచేయించి గెలిపిస్తామని చెబుతున్నారుకానీ అఖిలప్రియకే ఇంకా సీటు ఖరారు కాలేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. నంద్యాల నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇన్ఛార్జిగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డితోపాటు కొందరు కీలక నేతలు హాజరయ్యారు.

నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను బ్రహ్మానందరెడ్డి చంద్రబాబుకు వివరించారు. వివరాలన్నింటినీ క్రోడీకరించిన చంద్రబాబు నియోజకవర్గంలో తర్వాత ఏమేం చేయాలో అతనికి వివరించారు. సీటు ఇతరులకిస్తున్నామనికానీ ఏదీ చెప్పలేదు. దాదాపుగా నంద్యాల సీటు నుంచి ఈసారి బ్రహ్మానందరెడ్డి అభ్యర్థి అవుతారని భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో అఖిలప్రియ పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ఆళ్లగడ్డలో కూడా పార్టీని బలోపేతం చేయలేదు. సీటు విషయమై ఆమెకు హామీ ఇవ్వలేదు. భూమా కిషోర్ రెడ్డిని టీడీపీ తరఫున బరిలోకి దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన బ్రహ్మానందరెడ్డి 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నంద్యాల నియోజకవర్గంలో ఇంకా బాగా పనిచేయాలని సూచించడంతోపాటు కొన్ని సలహాలను కూడా చంద్రబాబు ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఈసారి మెజారిటీ సీట్లు సాధించాలనేది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications