టీడీపీ నాయకులకు ‘చంద్రబాబు మార్క్’ న్యాయం?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సత్తెనపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. కానీ అప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోడెల శివరామ్ (మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ తనయుడు) అధిష్టానానికి ఎదురుతిరిగారు.
పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడంలేదంటూ 16 మంది నాయకులకు టీడీపీ అధిష్టానం నోటీసులు జారీచేసింది. వీరంతా శివరాం అనుచరులే. దీనిపై ఇప్పుడు రగడ జరుగుతోంది. 40 సంవత్సరాల నుంచి పార్టీకి కొమ్ముకాస్తూ అండగా నిలబడ్డామని, కానీ చంద్రబాబునాయుడి నుంచి తమకు దక్కిన బహుమానం నోటీసులంటూ వారంతా మండిపడుతున్నారు. అంతేకాదు.. పల్నాడు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతున్న తరుణంలోనే ఈ నోటీసులు జారీ అవడం గమనార్హం.

కొన్ని దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతికి కష్టపడ్డామని, పార్టీకోసం పనిచేసినవారికి లభించే గౌరవం ఇదేనా? అని అక్కడి నాయకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణతో సుదీర్ఘకాలం పోరాడామని, ఆయనవల్ల కేసులతో ఎంతో ఇబ్బంది పడ్డామని శివరామ్ వర్గం చెబుతోంది. ఇప్పుడు పార్టీలోకి వచ్చారని తీసుకొని తమపై బలవంతంగా రుద్దుతారా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును కలవడానికి శివరాం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నోటీసులందుకున్న నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారనే ప్రచారం జరిగినప్పటికీ అది జరగలేదు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని, అలా కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులే పార్టీకి బలమనే భావనలో చంద్రబాబు ఉన్నారని, ఆ భావన నుంచి బాబు బయటపడితేనే టీడీపీకి మనుగడ ఉంటుందని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. చంద్రబాబుతోపాటు పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుపై విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications