విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్యలు..మూడు గంటలపాటు నిలిపివేత..
ఈ మధ్యకాలంలో తరచుగా రైలు ప్రమాదాలు, రైలు నిలిపివేతలు, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం వంటి వార్తలను చూస్తన్నాం. అయితే, తాజాగా విశాఖ ఎక్స్‌ప్రెస్ అన్నవరం రైల్వేస్టేషన్‌లో మూడు గంటలపాటు ఆగిపోయింది. ఇదే కాదు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కూడా ఆగిపోయింది. కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ సుమారు మూడుగంటలపాటు నిలిచిపోయాయి. దీంతో అన్నవరం రైల్వేస్టేషన్‌లో హడావిడి జరిగింది.
నిన్న (శుక్రవారం) రాత్రి జన్మభూమి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అన్నవరం రైల్వేస్టేషన్‌లో సుమారు మూడు గంటలపాటు నిలిచిపోయాయి. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ పలు సాంకేతిక సమస్యల కారణంగా అన్నవరం స్టేషన్‌లో ఆగిపోయింది. రైలులోని ఏసీ బోగీలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ట్రైన్ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆగిపోయింది. అయితే, అదే సమయంలో లింగంపల్లి నుంచి విశాఖ వస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అదే స్టేషన్‌లో ఆపివేసారు.

ఈ ట్రైన్ విశాఖ వెళ్లాల్సి ఉండటంతో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు లింక్ చేశారు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత రాత్రి 8.40 గంటల సమయంలో అన్నవరం నుంచి విశాఖ ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది. సాంకేతిక సమస్య ఏర్పడిన విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజిన్‌కు మరమ్మతులు చేసి అనంతరం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు కలిపారు. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రాత్రి 9.20 గంటల సమయంలో విశాఖపట్నం బయల్దేరింది.
పలు రైళ్లు దారి మళ్లింపు..
ఇదిలా ఉండగా, మరోవైపు భారీ వర్షాల నేపథ్యంగా విశాఖ-కిరండూల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను దారి మళ్లించారు. 18514 అనే నెంబర్‌గల విశాఖ-కిరండూల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సెప్టెంబరు 1వ తేదీ వరకు విజయనగరం, రాయగడ, కొరాపుట్ మీదుగా దంతెవాడ వరకు నడుస్తుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ వివరించారు. 18513 అనే నెంబర్‌గల కిరండూల్-విశాఖ ఎక్స్‌ప్రెస్ కిరండూల్ బదులు దంతెవాడ నుంచి బయలుదేరి కొరాపుట్, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖ చేరుకుంటుంది. దీంతో పాటు పలు రైళ్లను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
22974 అనే నెంబర్‌గల పూరీ- గాంధీదామ్ వీక్లి ఎక్స్‌ప్రెస్ ను ఈ నెల (ఆగస్టు) 31వ తేదిన రద్దు చేశారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పూరీ-ఉద్నా మధ్య స్పెషల్ ట్రైన్‌ను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. 08436 అనే నెంబర్‌గల పూరీ-ఉద్నా స్పెషల్ ట్రైన్ ప్రతి శనివారం ఉదయం 11.15 గంటలకు పూరీలో బయలుదేరి శ్రీకాకుళానికి సాయంత్రం 4.28 మీదుగా ప్రయాణించి మరుసటి రోజు రాత్రి 7.55 గంటలకు ఉద్నా చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో ఉద్నాలో ఆదివారం రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 8.35 గంటలకు పూరీ చేరుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications