వివేకా హత్య కేసులో కీలక మలుపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జెల ఉదయ్‌కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వీరిద్దరి బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నారు. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదించడంతో.. వాటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని వివేకా హత్యకేసులో నిందితుడిగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్యకు కుట్రదారుల్లో భాస్కర్ రెడ్డి ఉన్నట్టు సీబీఐ తన రిపోర్ట్ లో పేర్కొంది. ఈ మేరకు సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో వెల్లడించింది. కుట్ర, హత్య, ఆధారాలను మాయం చేసినట్టు కోర్టుకు తెలిపింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు ఇప్పటికే కొట్టేసింది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సందర్భంలో సీబీఐ కోర్టు.. సునీత, సీబీఐ వాదనలతో ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాదికి న్యాయస్థానం స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డిది కీలక పాత్ర అని, . ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. వీటితో ఏకీభవించిన కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.












Click it and Unblock the Notifications