శుంఠ పదం: జైపాల్ రెడ్డికి తెలంగాణ నేతల బాసట
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులపై శుంఠ పద ప్రయోగం చేసి విమర్శలు ఎదుర్కుంటున్న కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి తెలంగాణ నేతలు బాసటగా నిలిచారు. ఆయన ఆ పద ప్రయోగాన్ని చేయడాన్ని సమర్థించారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే ఉండవల్లి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉండేవారని పొన్నం వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన కరీంనగర్‌వో మీడియాతో మాట్లాడారు. ఉండవల్లి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఆప్తమిత్రుడు కాబట్టి సోనియాకు అనువాదకుడు అయ్యారని అన్నారు. జైపాల్‌రెడ్డిని విమర్శించే వాళ్లు ఆయన కాలిగోటికి సరిపోరని ఆయన అన్నారు. ఉండవల్లితో చర్చకు తాను సిద్ధమని పొన్నం సవాల్ విసిరారు. ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు రాష్ట్రపతిపై గౌరవం లేదని ఆయన అన్నారు.

కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సీమాంధ్ర నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. 'శుంఠలు' అన్న పదం బూతు కాదని ఆయన సోమవారం నల్లగొండలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సీమాంద్రులు భోగీ మంటల్లో తగులబెట్టడం అంటే 60 ఏళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమేనని ఆయన నల్లగొండలో మీడియా ప్రతినిధులతో అన్నారు. అందుకు ప్రతీకార చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
వచ్చే 2014 సాధారణ ఎన్నికల్లో నల్గొండ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేస్తానని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెసు నేతలు, కార్యకర్తలు తాను ఎంపీగానే పోటీ చేయాలని కోరుకుంటున్నారన్నారు. అధిష్టానం దూతలకు సైతం ఇదే విషయాన్ని కాంగ్రెసు పార్టీ నియోజకవర్గ శ్రేణులు చెప్పినట్లుగా తనకు సమాచారం ఉందన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను బోగి మంటల్లో తగులబెట్టడం సీమాంధ్ర నాయకుల మూర్ఖత్వమని తెలంగాణ జెఎసి నాయకుడు కోదండరామ్ అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని ఆయన అన్నారు. హైదరాబాదును ఐదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జైపాల్ రెడ్డి శుంఠ పదప్రయోగం చేయడాన్ని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తప్పు పట్టారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రజల హక్కుల ప్రయోజనాలకు కృషి చేస్తామని ఆమె సోమవారం చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో ఆలోచిస్తానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications