TDP నాయకుణ్ని రోడ్డుపై పరిగెత్తించి.. పరిగెత్తించి కొట్టారు!!
మస్తాన్.. నాగేశ్వరరావు వాహనాన్ని ఆపి.. నీ కారు డ్రైవర్‌తో పోస్టులు పెట్టించావుగా.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైనే పోస్టులు పెడతారా..? బ్రహ్మారెడ్డిని చూసుకుని ఎక్కువ చేస్తున్నావు అంటూ వాదనకు దిగాడు.
పల్నాడు జిల్లాలో దాడులు కలకలం రేకెత్తిస్తున్నాయి. వెన్నా బాలకోటిరెడ్డిపై దాడి జరగడం.. చికిత్స పొందుతూ మరణించడం.. అలా ముగిసిందో లేదో మాచర్ల నియోజకవర్గంలో మరో వివాదం రేకెత్తింది. సోషల్ మీడియాలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించాడని.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను రోడ్డుపై పరిగెత్తించి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం మాచర్ల పోలీస్‌స్టేషన్లో సంతకాలు చేసేందుకు వచ్చారు. కారంపూడికి చెందిన పార్టీ కార్యకర్త గోరంట్ల నాగేశ్వరరావు బ్రహ్మారెడ్డికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించారు.

కాపుకాసిన నలుగురు వ్యక్తులు
తర్వాత రోజు ఉదయం ఆ వంట సామగ్రి అప్పజెప్పేందుకు వెళ్లి అంకాళమ్మ ఆలయం మీదుగా ఇంటికి వస్తున్నాడు. అక్కడే కాపు కాసిన నలుగురు వ్యక్తుల్లో ఒకరైన మస్తాన్.. నాగేశ్వరరావు వాహనాన్ని ఆపి.. నీ కారు డ్రైవర్‌తో పోస్టులు పెట్టించావుగా.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైనే పోస్టులు పెడతారా..? బ్రహ్మారెడ్డిని చూసుకుని ఎక్కువ చేస్తున్నావు అంటూ వాదనకు దిగాడు. ఇంతలో ఒప్పిచర్లకు చెందిన చిరుమామిళ్ల శ్రీకాంత్ వెనుక నుంచి కర్రతో నాగేశ్వరరావుపై దాడి చేశాడు. నరేంద్ర, చోటా కరీమ్ సైతం అతన్ని ఇనుపరాడ్లతో కొట్టారు. బస్టాండ్ వైపు నాగేశ్వరరావు పరుగు తీయగా తరుముతూ.. కొట్టుకుంటూ వచ్చారని బాధితుడు తెలిపాడు.

పోలీసులముందే మరోసారి చేయి చేసుకున్నారు
కారంపూడికి చెందిన సాంబశివరావు అనే కారు డ్రైవర్.. నాగేశ్వర రావును ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అయితే.. నాగేశ్వరరావుపై దాడి చేసిన వ్యక్తులు అక్కడికి వచ్చి పోలీసులు, టీడీపీ నాయకుల ముందే మరోమారు అతనిపై చేయి చేసుకున్నారు. నాగేశ్వరరావును పోలీసులు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కర్రలతో కొట్టి గాయపరిచినట్లు కేసు నమోదు చేశామని ఎస్సై రామాంజనేయులు తెలిపారు. నరసరావుపేటలో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావును జూలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు.

డబ్బుల కోసమే దాడిచేశాం..
అయితే.. దాడి చేసిన వ్యక్తులు మాత్రం రాజకీయ కారణం కాదని చెబుతున్నారు. క్రికెట్ బుకీగా వ్యవహరించే గోరంట్ల నాగేశ్వరరావు.. తమకు ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతుంటే దాటవేస్తున్నారని, దీంతో వివాదం చెలరేగిందని, అందుకే కొట్టామని చిరుమామిళ్ల శ్రీకాంత్, నరేంద్ర, చోటా కరీమ్, మస్తాన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. డబ్బుల విషయంలో జరిగిన గొడవేకానీ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని ఆ వీడియోలో స్పష్టం చేశారు












Click it and Unblock the Notifications