తెలుగు ఛానళ్లకు సుప్రీంకోర్టులో ఊరట: ఏపీ సర్కారుకు ఆదేశాలు, ‘దేశద్రోహం’కు పరిమితులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలుగు న్యూస్ ఛానళ్లు టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లకు ఊరట లభించింది. ఈ రెండు ఛానళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అంతేగాక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలను చేసింది. 'దేశద్రోహం' నిర్వచనానికి సరైన పరిమితులు విధించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది.

టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా చర్యలొద్దు
తెలుగు న్యూస్ ఛానళ్లు టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు ఉపక్రమించకూడదని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
'ఛానెళ్లపై దేశద్రోహ కేసులు నమోదు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చానెళ్లను మఫ్లింగ్ చేస్తోంది. దేశద్రోహాన్ని కోర్టు నిర్వచించే సమయం ఇది' అని జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

రఘురామ ప్రసంగాల ప్రసారం.. దేశద్రోహం అభియోగాలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు ఈ రెండు తెలుగు ఛానళ్లపై దేశద్రోహ అభియోగాల కింద కేసులు నమోదు చేసింది. కరోనాను కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రఘురామ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టుకు ఆ 2 తెలుగు న్యూస్ ఛానళ్లు
కాగా, కోవిడ్ సంబంధిత ఫిర్యాదులను చేసినందుకు పౌరులను శిక్షించకుండా ప్రభుత్వాలను నిరోధిస్తూ ఇటీవలి కోర్టు ఉత్తర్వులను ఆంధ్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని న్యూస్ ఛానల్స్ సుప్రీంకోర్టుకు వెళ్లాయి. రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన ప్రసంగాలను ఇతర ఛానళ్లు కూడా ప్రసారం చేశాయని టీవీ5 కోర్టుకు తెలిపింది.
Recommended Video

రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తన పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరిన వారాల తరువాత.. వైసీపీ ఎంపీ రఘురామను మే 14 న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మే 21న రఘురామకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కస్టడీలో అతడ్ని కొంత ఇబ్బందులకు గురిచేసినట్లు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రఘురామ కృష్ణరాజు ఢిల్లీకి వెళ్లారు.












Click it and Unblock the Notifications