సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న వేళ.. తిరుమలలో కీలక పరిణామం
Tirumala Laddu row: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదంపై విచారణ ముమ్మరం సాగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా, స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనెను కల్తీ చేసినట్లు వస్తోన్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విస్తృత తనిఖీలను చేపట్టింది.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం. సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి సారథ్యంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకట్ రావు, డిప్యూటీ ఎస్పీలు జీ సీతారామ రావు, జే శివనారాయణ స్వామి, అన్నమయ్య రాయచోటి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ టీ సత్యనారాయణ, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ కే ఉమా మహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఎం సూర్యనారాయణలతో కూడిన టీమ్ ఇది.
ప్రధానంగా- తమిళనాడులోని దిండిగల్‌లో గల ఏఆర్ డెయిరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ తన దర్యాప్తు మొదలు పెట్టింది. మూడో రోజు విచారణలో భాగంగా తిరుమలలో గల టీటీడీకి చెందిన ఫ్లోర్ మిల్, ల్యాబొరేటరీ, మార్కెటింగ్ కార్యాలయం, శ్రీవారి పోటును అధికారులు తనిఖీ చేశారు.
కాంట్రాక్టర్లు సరఫరా చేసిన నెయ్యిని ఈ ఫ్లోర్ మిల్‌లోనే నిల్వ ఉంచుతారు టీటీడీ సిబ్బంది. లాబొరేటరీల నుంచి వచ్చిన రిపోర్టులను పరిశీలించి- అందులో ఎలాంటి కల్తీ లేదని నిర్ధారించుకున్న తరువాతే ఈ ఫ్లోర్ మిల్‌లో స్టోర్ చేస్తారు. ఫ్లోర్ మిల్‌లో అన్ లోడింగ్ కోసం వచ్చిన ట్యాంకర్లు, అప్పటికే అక్కడ నిల్వ ఉన్న క్యాన్‌ల నుంచి నెయ్యి శాంపిళ్లను సేకరించారు.
అలాగే- టీటీడీ ల్యాబొరేటరీని తనిఖీ చేశారు. టీటీడీ అనుసరిస్తోన్న నెయ్యి పరీక్షా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దాని గురించి సమగ్ర వివరాలను సేకరించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే ఎండు ద్రాక్ష, కాజు, ఇతర ఇంగ్రేడియంట్స్ నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబొరేటరీ సిబ్బందితో మాట్లాడారు.
శ్రీవారి పోటును సందర్శించారు సిట్ అధికారులు. లడ్డూ తయారీ గురించి శ్రీవైష్ణవ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఫ్లోర్ మిల్ నుంచి శ్రీవారి పోటుకు నెయ్యి, ఇతర లడ్డూ తయారీ ఇంగ్రేడియంట్స్ తరలింపు విధానంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన ఎంట్రీ జాబితాను పరిశీలించారు.












Click it and Unblock the Notifications