తిరుమల పర్యటన వేళ.. పిలుపునిచ్చిన వైఎస్ జగన్
Tirumala Laddu row: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది వైఎస్ఆర్సీపీ.
ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పార్టీ క్యాడర్‌కు ఆదేశాలను ఇచ్చింది. తిరుమల, శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవహరిస్తోన్నారంటూ మండిపడింది.

రాజకీయ కారణాలతో ఉద్దేశపూరకంగానే లడ్డూ విషయంలో ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు చెప్పారని, ఈ అసత్య ప్రచారంతో చంద్రబాబు.. వేంకటేశ్వరస్వామి వైభవానికి కళంకం చేశారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని సూచించారు.
ఇందులో భాగంగా ఆయన స్వయంగా తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి సేవలో పాల్గొనబోతోన్నారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు జగన్. 4:50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
శనివారం ఉదయం 10:30 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. గంట పాటు అక్కడే ఉంటారు. 11:50 నిమిషాలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2:40 నిమిషాలకు బెంగళూరు ఇంటికి చేరుకుంటారు.
తన తిరుమల పర్యటన సందర్భంగా ఎలాంటి హడావుడి చేయవద్దంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్. ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నానని అన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు స్వాగతం పలకవద్దని సూచించారు.
కాగా- తొలుత అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకోవాలని వైఎస్ జగన్ భావించినప్పటికీ అది సాధ్యపడట్లేదు. కాలి గాయం తిరగబెట్టడం వల్ల అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల వెళ్లాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కారులోనే తిరుమలకు చేరుకుంటారు.












Click it and Unblock the Notifications