ఏం బాలేదు: మోడీపై కవిత యూ టర్న్, కేసీఆర్ గ్రేటర్ ప్రేమ: ఏకేసీన అలీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి యూ టర్న్ తీసుకుంటోందా!? అంటే అలాగే కనిపిస్తోంది. నిన్నటి వరకు బీజేపీకి దగ్గర జరుగుతున్నట్లు ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయి.
తాజాగా ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు యూ టర్న్ తీసుకున్నట్లుగా ఉన్నాయి. తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రను కలిశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కేబినెట్లో చేరాలనే విషయం రెండు వైపుల నుండి ప్రతిపాదన రాలేదని, అలాంటిది వచ్చినప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. ప్రధాని మోడీ ఏడాది పాలన.. మాటలు ఎక్కువ, పని తక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
క్షేత్రస్థాయిలో అనుకున్న పనులు జరగడం లేదన్నారు. విభజన చట్టం అమలుపై వేగం లేదన్నారు. కాగా, నిన్నటి వరకు కవిత మాట్లాడుతూ.. ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని చెప్పారు. మోడీతో సెల్ఫీ దిగి కితాబిచ్చారు. ఇప్పుడు విమర్శలు గుప్పించడం గమనార్హం.

కేసీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం సవాల్ విసిరారు. ఇళ్లు కట్టించేందుకు విశ్వవిద్యాలయాల స్థలం తీసుకోవడం సరికాదన్నారు.
తాము ఖాళీ స్థలాలు చూపిస్తే అక్కడ ఇళ్లు కట్టించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ పేదల పైన ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఉంటున్న మూడెకరాల స్థలానికి మరో పదకొండు ఎకరాలు అదనంగా అవసరమా అని ప్రశ్నించారు.
ఓయూకు ఆట స్థలం వద్దు కానీ, కేసీఆర్‌కు 14 ఎకరాలు కావాలా అని ప్రశ్నించారు. ఆరు ఎకరాల స్థలంలోనే నిజాం నివసించారన్నారు.
విశ్వవిద్యాలయాల పైన కేసీఆర్‌కు కోపమెందుకని ప్రశ్నించారు. కబ్జా చేసిన తెరాస భవనం కూలగొట్టాలన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఆయన మాట తప్పారన్నారు. ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అమలు చేశారా చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications