తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తునకు టీటీడీ అనుమతి
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం పెద్దగా వేచి ఉండనక్కర్లేదు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం 67,728 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 21,084 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోటా ఇప్పటికే విడుదలైంది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ పథకం వీఐపీ బ్రేక్ దర్శనం కోటా టికెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. ఒక్కో టికెట్ ధర 10,500 రూపాయలు. శ్రీవాణి ట్రస్ట్ కింద భక్తులు అందజేసే విరాళాలను టీటీడీ దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలపై అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకుని రావడానికి తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. ఇది- స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీ. వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు, నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయడానికి ఈ నిజనిర్ధారణకు టీటీడీ పాలక మండలి అనుమతి ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక పురాతన ఆలయాల జీర్ణోద్ధరణతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి టీటీడీ నిధులు అందిస్తోన్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

దీనిపాటు ఆయా ప్రాంతాల్లో గల ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం కూడా అందజేస్తోన్నామని వివరించారు. శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేశామని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు శ్రీవాణి ట్రస్టు నిర్వహణపై ఆరోపణలు చేస్తోన్నారని పేర్కొన్నారు.
ఈ విషయంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకుని రావడానికి తిరుపతి ప్రెస్ క్లబ్ నిజనిర్ధారణ కమిటీగా ఏర్పాటై ముందుకు వచ్చిందని ఆయన వివరించారు. వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ కమిటీకి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. తప్పులు జరిగితే భయపడాలని, అలాంటిదేమీ లేనప్పుడు ఎలాంటి కమిటీతోనైనా దర్యాప్తు జరిపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications