TTD: తిరుమలలో ఈ నెలలో 12 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఇప్పటికే కార్తీక మాసం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అదే విధంగా డిసెంబర్ 23వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఆ సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నెలలో విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు. డిసెంబరు 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం నిర్వహిస్తారు. డిసెంబరు 8న సర్వ ఏకాదశి, డిసెంబరు 12న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 17న ధనుర్మాసం ప్రారంభం కానుంది. డిసెంబరు 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర, డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. స్వర్ణరథోత్సవం నిర్వహిస్తారు. డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారి చక్రస్నానం తో పాటుగా శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం నిర్వహించనున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు పెద్దపీట వేయడంలో భాగంగా వైకుంఠ ఏకాదశి రెండు రోజుల ముందు నుండి ద్వాదశి వరకు అనగా డిసెంబరు 21 నుండి 24వ తేదీ వరకు, అదేవిధంగా డిసెంబరు 30 నుండి 2024, జనవరి ఒకటో తేదీ వరకు దాతలకు, వారి సిఫార్సు లేఖలతో వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో దర్శనం బుక్ చేసుకున్న దాతలను రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. దాతలందరికీ జయవిజయుల వద్ద నుండి మహాలఘు దర్శనం కల్పిస్తారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications