ఎవరయ్యా.. ఈ కృష్ణమూర్తి?? టీటీడీ బోర్డు సభ్యుడిగా నాలుగోసారి!!
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నాలుగోసారి ఆయన స్థానం సంపాదించారు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన ఏమైనా మ్యాజిక్ చేస్తారా? అంటూ చర్చ నడుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుడి పదవిని తలపండిన రాజకీయవేత్తలు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా సంపాదించలేకపోయారు. ఇందులో సభ్యత్వం కోసం ప్రధానమంత్రి నుంచి కేంద్ర మంత్రుల వరకు సిఫార్సులు చేయించుకుంటారు.
వెంకటేశ్వరస్వామివారికి చేసే సేవ సంగతి పక్కన పెడితే సమాజంలో పలుకుబడి పెంచుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. తమకు ఉండే ప్రొటోకాల్ ను వినియోగించుకొని కార్పొరేట్ దిగ్గజాలకు దగ్గరవుతుంటారు. అలా ఆ పరపతితో తమ వ్యాపారాన్ని పెంచుకుంటారు. దీనివల్లే టీటీడీ బోర్డు సభ్యుడి పదవికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.

ముఖ్యమంత్రి జగన్ కూడా ఒకానొక సందర్భంలో మంత్రి వర్గాన్ని సులభంగా ఎంపిక చేయగలిగాను కానీ.. టీటీడీ బోర్డు నియామకం మాత్రం అంత సులువుగా చేయలేకపోయానని వ్యాఖ్యానించారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత డిమాండ్ ఉన్న ఈ పదవి పదే పదే కృష్ణమూర్తిని వరిస్తోంది. చెన్నైలో ఆడిటర్ గా పనిచేస్తుంటారు. 2015 ఏప్రిల్ 27న తొలిసారిగా ఆయన టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. 2018లో స్థానం దక్కలేదు.
2019 సెప్టెంబరులో మరోసారి బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈయనకు వరుసగా అవకాశం వస్తూనే ఉంది.2021లో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే బోర్డులోని వేమిరెడ్డి ప్రశాంతిని ఢిల్లీ ఎల్ఏసీ ఛైర్ పర్సన్ గా నియమించి ఆమె స్థానంలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. 2015 నుంచి ఇప్పటివరకు మొత్తం 8 సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు బోర్డు సభ్యుడిగా కొనసాగారు. ఇప్పుడు కూడా అవకాశం దక్కింది. తొలిసారి పదవిని చేపట్టినప్పుడు కేంద్రంలో ఓ కీలక మహిళా మంత్రి సిఫార్సుతో వచ్చారనే ప్రచారం జరిగింది. కేంద్రంలో ప్రధానమంత్రి తర్వాత కీలక మంత్రిగా ఉన్న వ్యక్తి సిఫార్సులతో టీటీడీలో అవకాశాన్ని పొందగలుగుతున్నారన్న చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications