తిరుమల, అలిపిరిల్లో చిరుతల ప్రవేశానికి చెక్
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 62,642 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,887 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.18 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పట్టింది.
ఏడుకొండల్లో చిరుతలు, ఎలుగుబంట్లు ఇతర వన్యప్రాణుల నుంచి భక్తులకు రక్షణ కల్పించడానికి టీటీడీ చర్యలు తీసుకుంది. భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తిరుమల కాలిబాటలు, శేషాచల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు టీటీడీ అధికారులు వారం రోజుల డ్రోన్, సీసీటీవీ కెమెరా ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది అధికారులకు సకాలంలో హెచ్చరికలు అందించి భక్తులను రక్షించడానికి తోడ్పడుతుంది.

ఈ వ్యవస్థ జంతువుల చిత్రాలను, వీడియోలను గుర్తించిన వెంటనే ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కు పంపుతుంది. తిరుమల కాలిబాటలో నరసింహస్వామి ఆలయం సమీపంలో గతంలో అయిదేళ్ల బాలిక లిఖితను చిరుతపులి చంపిన ఘటన తర్వాత టీటీడీ, వన్యప్రాణుల నిర్వహణ విభాగం మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. వన్యప్రాణులను గుర్తించేందుకు టీటీడీ అత్యాధునిక థర్మల్ ఇమేజింగ్ సాంకేతికతను సమకూర్చుకుంది.
చీకటిలో కూడా ఈ టెక్నాలజీ జంతువుల హీట్ సిగ్నేచర్ పసిగట్టి వాటిని గుర్తించగలదు. వాటి కదలికలను పసిగట్టగలదు. ట్రయల్ సమయంలో సాంకేతిక నిపుణులు రెండు డ్రోన్లు, 12 సీసీటీవీ కెమెరాలను ఉపయోగించారు. ఇవి విజయవంతంగా పని చేశాయి. రాత్రిపూట లేదా దట్టమైన అటవీ ప్రాంతంలో సంప్రదాయ కెమెరాలు పనిచేయని చోట ఈ హీట్ సిగ్నేచర్, థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ కెమెరాల అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయని అధికారులు ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు వివరించారు.
టీటీడీ, ప్రభుత్వం నిర్దేశించిన సరిహద్దుల్లో మ్యాన్యువల్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు తెలిపారు. త్వరలో 110 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వీటన్నింటినీ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానిస్తామని తెలిపారు. కొన్ని కెమెరాలకు లౌడ్‌స్పీకర్లు, వూఫర్లను అమర్చారు. ఇవి శబ్దాలను ఉత్పత్తి చేసి జంతువులను భక్తుల మార్గాల నుండి అడవి లోపలికి తరిమేస్తాయి.
డేటాను విశ్లేషించి వన్యప్రాణుల కదలికలను గుర్తించి, వాటిని భక్తుల కాలిబాటలకు దూరంగా ఉంచడానికి కృషి చేస్తారు. ప్రత్యేక సిబ్బంది నిరంతరం సిద్ధంగా ఉంటారు. పెరుగుతున్న ఎండ వల్ల చిరుతపులులు ఆహారం, నీటి కోసం బయటకు వస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుత వేసవి, అధిక ఎండల కారణంగా చిరుతపులులు బయటకు వస్తాయని, వాటి నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటవీ శాఖ, టీటీడీ చర్యలు తీసుకున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications