తిరుమలలో టీటీడీ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీల్లో..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 74,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,050 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- శ్రీవాణి ట్రస్ట్ కోటా కింద టికెట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని, దీనికి సంబంధించిన క్యూలైన్లల్లో కనీసం కూర్చోవడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు లేవని కొందరు భక్తులు ఆరోపించారు. గదుల కేటాయింపు విషయంలోనూ టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారని, బల్లులు, బొద్దింకలు ఉండే వసతి గదులను కేటాయిస్తోన్నారని చెప్పారు.
ఒక్కో టికెట్ పై 10,000 రూపాయల మొత్తాన్ని చెల్లించి.. స్వామివారి దర్శనానికి వచ్చే శ్రీవాణి భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదని వాళ్లు విమర్శించారు. వసతి గదుల నిర్వహణ గురించి సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలపై టీటీడీ స్పందించింది. వివరణ ఇచ్చింది. ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు తిరుమలలో శ్రీవాణి టికెట్లు జారీ చేస్తోన్నామని, అంతకంటే ఒక గంట ముందు వస్తే మాత్రమే భక్తులను కౌంటర్ వద్దకు అనుమతిస్తోన్నామని పేర్కొంది. ఈ ఆరోపణలు చేసిన సదరు భక్తులు తెల్లవారుజామున 3:30 గంటలకు వచ్చారని వివరించింది.
టికెట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని, అన్నపానీయ సౌకర్యాలను కల్పించలేదనడం సరికాదని టీటీడీ తెలిపింది. సాధారణంగా శ్రీవాణి టికెట్ కౌంటర్ తెరిచే సమయానికి ముందు నుండే టీ, కాఫీ, పాలు, మజ్జిగ నిరంతరం సరఫరా చేస్తోన్నామని పేర్కొంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫొటోలను విడుదల చేసింది.
సాధారణంగా గురు, శుక్ర, శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు శ్రీవాణి దర్శనాల కోసం వస్తుంటారని, ముందు వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికలో పరిమిత సంఖ్యలో ఉండే శ్రీవాణి టికెట్లను ప్రతిరోజూ కేటాయిస్తుంటామని పేర్కొంది.
బల్లులు, బొద్దింకలు ఉన్నాయని భక్తులు ఆరోపించడంతో వెంటనే వారికి కేటాయించిన ట్రావెలర్స్ బంగళా కాటేజీలో వారికి కేటాయించిన వసతి గదుల్లోని పారిశుద్ధ్యంపై తనిఖీలు నిర్వహించామని, గదులన్నీ పరిశుభ్రంగానే ఉన్నాయని టీటీడీ వివరించింది. అపరిశుభ్రత లేదా బొద్దింకలు లేవని తెలిపింది.
వాస్తవాలు ఇలా ఉంటే భక్తులు టీటీడీపై ఉద్దేశపూరకంగా ఆరోపణలు చేయడం సరికాదని, టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దిగజార్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమల రద్దీని, పరిమిత సంఖ్యలోని వసతి గదులను దృష్టిలో పెట్టుకుని భక్తులు కూడా సంయమనంతో సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications