ప్రవచనకర్త చాగంటికి తిరుమలలో అవమానం జరిగిందా?
Chaganti Koteswara Rao: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన కర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వర రావుకు తిరుమలలో అవమానం జరిగిందని, ఆయన ప్రవచనాల కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల టీటీడీ అధికారులు స్పందించారు. ఈ వార్తలను తోసిపుచ్చారు. వాస్తవం ఏమిటనేది వివరించారు.
టీటీడీ ప్రొసీడింగ్స్..
ప్రతి సంవత్సరం జనవరిలో చాగంటి కోటేశ్వరరావు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన శ్రీవారి దర్శనం, 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. దీనికోసం కిందటి నెల 20వ తేదీన టీటీడీ అధికారులు ప్రొసిడింగ్స్ ఇచ్చారు.

ప్రొటోకాల్ ప్రకారం..
చాగంటి కోటేశ్వర రావు ప్రభుత్వ సలహాదారు కావడం, ఆయనకు కేబినేట్ ర్యాంక్ ఉండటం వల్ల ప్రొటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం 14వ తేదీన శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేశారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా ఆయన బస చేసిన రామ్ బగీచ గెస్ట్ హౌస్ నుండి శ్రీవారి ఆలయానికి ఆయనను తీసుకెళ్లడానికి బగ్గీ, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతి ఇచ్చారు.
సాధారణ భక్తుల తరహాలోనే
వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నప్పటికీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారని టీటీడీ అధికారులు వివరించారు. పలువురు ప్రముఖులు, సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని ఆయనే స్వయంగా సూచించారని, ఈ మేరకు స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు.
తోపులాటను దృష్టిలో పెట్టుకుని
అదే విధంగా ఈ నెల 8వ తేదీన తిరుపతిలో చోటు చేసుకున్న తోపులాటను దృష్టిలో పెట్టుకుని.. ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని ఆయనకు విజ్ఞప్తి చేశామని, దీనికి చాగంటి అంగీకరించారని టీటీడీ అధికారులు వివరించారు. ఆయన ఇచ్చే అపాయింట్మెంట్ తేదీలకు అనుగుణంగా మరోసారి ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
వారిపై చట్టపరమైన చర్యలు
వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల వల్ల చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు వార్తలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications