శ్రీవారి భక్తులకు శుభవార్త... ఇక సుపథం నుంచి దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం తన భక్తులకు శుభవార్తను వినిపించింది. అలిపిరి దగ్గర ఉన్న సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకు కూడా శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది. హోమం టికెట్ కాకుండా రూ.300 అదనంగా చెల్లించిన వారికి సుపథం నుంచి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటును కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
టీటీడీకి చెందిన రోడ్లు, సంస్థలు ఉన్న ప్రాంతాలు, భక్తులు సంచరించే ముఖ్య ప్రాంతాల్లో కోర్టు ఉత్తర్వులకు లోబడి పారిశుధ్య టెండర్లను కేటాయించనున్నట్లు భూమన తెలిపారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో ఫిబ్రవరిలో తిరుమలలో సదస్సు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.

తిరుపతిలో టీటీడీకి సంబంధించిన ఆస్తులు 48 శాతం ఉన్నాయని.. వీటిపై నగరపాలికకు ఎలాంటి ఆస్తి పన్నును చెల్లించడంలేదన్నారు. హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే పారిశుధ్య టెండర్లపై ముందుకు వెళతామన్నారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి సత్రాల స్థానంలో రూ.209.65 కోట్ల వ్యయంతో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి టెండర్లను ఆమోదించినట్లు వివరించారు. కొండపైన యాత్రికుల కాటేజీల్లో నివాసముంటున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించడం కోసం ప్రస్తుతమున్న పాత పోలీసు క్వార్టర్స్‌ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని, దీనికి సంబంధించిన టెండరు ఖరారుకు భూమన ఓకే చెప్పారు.












Click it and Unblock the Notifications